ఇటీవల హైదరాబాద్ లో వరుసగా జరుగుతున్న సంఘటలపై ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యంగా చార్మినార్ ను ఆనుకుని ఉన్న భాగ్యలక్ష్మి ఆలయం వివాదానికి సీఎం కిరణ్ కుమార్ రెడ్డి బాధ్యత వహించాలంటూ ఒవైసీ అల్టిమేటమ్ ఇచ్చారు. రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వంతో పాటు కేంద్రంలోని యూపీఏ సర్కారుకు మద్దతు కొనసాగించాలా వద్దా అనే అంశంపై సోమవారం జరిగే అత్యవసర సమావేశంలో తుది నిర్ణయం తీసుకుంటామని ఒవైసీ అన్నారు. ఒవైసీ ఆగ్రహానికి కారణం చార్మినార్ ను ఆనుకొని ఉన్న భాగ్యలక్ష్మి ఆలయమే కేంద్ర బిందువైంది. . బీజేపీ, ఇతర అనుబంధ సంస్థలు చేస్తున్న హడావుడిని ప్రభుత్వం చూస్తూ ఉంటోందని ఎంఐఎం నేతలు భావిస్తున్నారు. తమ ఉనికికే ప్రమాదం వచ్చే పరిస్థితులు ఏర్పడుతుండడంతో కాంగ్రెస్ తో తాడో పేడో తేల్చుకునేందుకు సిద్దమైనట్టు కనిపిస్తోంది. అయితే ఇటీవల కాలంలో ఎంఐఎం నేతలు కాంగ్రెస్ పార్టీకి దూరంగా ఉంటున్నారన్న ప్రచారం కూడా జరుగుతోంది. వైఎస్ హయాంలో వైఎస్ తో సన్నిహిత సంబంధాలు నెరిపిన ఎంఐఎం నేతలు ఇప్పుడు జగన్ తోనూ సత్సంబంధాలు కలిగి ఉన్నారని ఎన్నికల నాటికి వైఎస్ఆర్ కాంగ్రెస్ కు మద్దతు ప్రకటిస్తారన్న ప్రచారం జరుగుతోంది. అదే జరిగితే కిరణ్ ప్రభుత్వం ఇబ్బందుల్లో పడడం ఖాయంగా కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో సోమవారం జరగబోయే ఎంఐఎం పార్టీ ప్రతినిధుల సమావేశంపై ఆసక్తి నెలకొంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: