తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ గత కొద్ది రోజులుగా సంచలన వ్యాఖ్యలు చేస్తూ రాజకీయ వర్గాల్లో హాట్ డిస్కషన్స్ కి దారి తీస్తున్నారు. తాజాగా ఆయన మరోసారి చేసిన కొన్ని సంచలన వ్యాఖ్యలు హాట్ టాపిక్ అయ్యాయి. వరంగల్‌ జిల్లా, హన్మకొండ, భీమారంలోని ఓ ఫంక్షన్‌ హాల్‌లో సోమవారం జరిగిన టీఆర్ఎస్ కార్యకర్తల సమావేశంలో మాట్లాడిన మంత్రి ఈటల.. రాజకీయాలపై, రాజకీయ నాయకులపై రాను రాను విశ్వాసం పోతోందని కీలక వ్యాఖ్యలు చేశారు. రాజకీయ నాయకులపై ప్రజలకు ఒకప్పుడు అపారమైన విశ్వాసం ఉండేదని కానీ ఇప్పుడు ప్రజలకు రాజకీయ నాయకులపై పూర్తిగా నమ్మకం పోయిందని సంచలన వ్యాఖ్యలు చేశారు. గతంలో రాజకీయ నాయకుల పట్ల ప్రజలకు గౌరవం, విశ్వాసం ఉండేదని కానీ ఇప్పుడు ప్రజలకు రాజకీయ నాయకుల పట్ల ఎలాంటి భావన ఉందో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదని ఆయన అన్నారు.

ఈ సమావేశంలో బీజేపీ పార్టీ నేతలను తీవ్రంగా విమర్శించిన మంత్రి ఈటల.. బీజేపీ సోషల్ మీడియాలో మసిపూసి మారేడు కాయ చేసే ప్రయత్నం చేస్తోందని చెప్పుకొచ్చారు. అది మంచి సంప్రదాయం కాదని అన్న మంత్రి ఈటల తాత్కాలిక విజయాల కోసం.. తాత్కాలికమైన ప్రయోజనం కోసం సంప్రదాయాలను, గౌరవాలను ఫణంగా పెట్టే పరిస్థితి రావద్దని కడియం శ్రీహరి లాంటి వాళ్లు ఎక్కువగా కోరుకుంటారని.. తాను కూడా అదే కోరుకుంటున్నారని అన్నారు.

రాజకీయ నాయకులు ఎప్పుడూ కూడా సమాజ శ్రేయస్సు కోసమే పని చేస్తారని.. ప్రజల్ని ఇబ్బంది పెట్టడం కోసమో లేక.. సొంత ప్రయోజనాల కోసమో రాజకీయ నాయకులు ఆశించరని.. కానీ ప్రస్తుతం అట్లా చిత్రీకరించేటటువంటి పరిస్థితి వచ్చిందని మానవ సంబంధాల్లోనే కాకుండా, రాజకీయ నాయకులు.. ప్రజల మధ్య ఉండే సంబంధాల్లో చోటుచేసుకుంటున్న బాధాకరమైన సన్నివేశాల్ని ఇవ్వాళ మనం చూస్తున్నామని ఆయన అన్నారు. ఏదో ఒక రోజు పెరుగుట విరుగుట కోసమే అన్నట్టుగా ఇట్లాంటివన్నీ పెరుగుతాయి.. మళ్లీ ఎక్కడో తప్పకుండా విరుగుతాయనే నమ్మకం తనకు ఉందని మంత్రి ఈటల ధీమా వ్యక్తం చేశారు. అంతిమంగా రాజకీయాలు, రాజకీయ నాయకుల పట్ల గౌరవం పెరిగేలా ప్రజలను మనం డ్రైవ్‌ చేయాలని మంత్రి ఈటల అన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: