ప్రపంచ ధరిత్రీ దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు చెప్పారు. ‘జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసి’ అంటే..‘మనం జన్మించిన భూమి స్వర్గం కంటే గొప్పది’ అని రామాయణంలో వాల్మీకి మహర్షి చెప్పిన సూక్తిని మనం నివసిస్తున్న ప్రాంతం పట్ల అభిమానాన్ని పెంచుకొని, పర్యావరణాన్ని కాపాడుకోవడానికి మనందరం ఆదర్శంగా తీసుకోవాల్సిన అవసరము ఉందని ఆయన అన్నారు. మనం పుట్టిన ఊరు పట్టణం ఏదైనా, మనం నివసిస్తున్న ప్రాంతాన్ని కాలుష్యరహితంగా,పరిశుభ్రంగా, పచ్చదనంతో ఉంచేందుకు కృషి చేయాలని కోరారు. పర్యావరణ పరిరక్షణ కోసం ధరిత్రీ దినోత్సవం సందర్భంగా ప్రతి తెలంగాణ పౌరుడూ ప్రతినబూనాలని ఆయన కోరారు.

ధరిత్రీ రక్షణ చర్యల్లో భాగంగా తెలంగాణను పచ్చగా మార్చేందుకు, రాష్ట్ర ప్రభుత్వం అమలు పరుస్తున్న‘‘తెలంగాణకు హరితహారం’’ కార్యక్రమం విజయవంతంగా నడుస్తున్నదని సిఎం చెప్పుకొచ్చారు. పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి లో భాగంగా పరిశుభ్రత పచ్చదనం కార్యక్రమాలు విజయవంతంగా అమలవుతున్నాయని చెప్పిన ఆయన... తాగునీరు సాగునీరు లేక కరువు కాటకాలతో అల్లాడిన తెలంగాణ నేలలో నేడు అడుగడుగునా జీవ జలం ప్రవహిస్తున్నది అంటూ పేర్కొన్నారు. ప్రాజెక్టులు కట్టి, కాల్వలతో నదీ జలాలలను సుదూర ప్రాంతాలకు తెలంగాణ వ్యాప్తంగా పల్లె పల్లెకూ తరలించడం ద్వారా చెరువులు కుంటలు నిండి భూగర్భ జలాలు సమృద్దిగా పెరిగాయని వివరించారు.

తద్వారా పంటలకు, మనుషులకే కాకుండా పశు పక్షాదులకు మేలుజరిగి తెలంగాణ నేలమీద ప్రకృతి సమసతుల్యత సాధించగలిగామని అని ఆయన వివరించారు. నేడు తెలంగాణ అంతటా జల లభ్యత పెరగడంతో పచ్చదనం పరిఢవిల్లుతూ వాతావరణం చల్లబడడం వంటి గుణాత్మక మార్పులకు చోటుచేసుకుంటున్నాయని హర్షం వ్యక్తం చేసారు. పక్షులు తిరిగి చెరువులను కుంటలను ఆశ్రయిస్తూ చెట్లమీద వాలుతూ కిల కిలారావాలతో తిరిగి ప్రాణం పోసుకుంటున్నాయని తద్వారా జీవవరణాన్ని తిరిగి తెలంగాణలో సాధించగలిగామని ఆయన అన్నారు.  తెలంగాణ స్వరాష్ట్రాన్ని సాధించిన నాటినుంచి  ప్రభుత్వం చేపడుతున్న అనేక చర్యలు ఈ భూగోళంలో భాగమైన తెలంగాణ ప్రాంతాన్ని సుభిక్షంగా మార్చేందుకు దోహదపడ్డాయని సిఎం చెప్పుకొచ్చారు.

మరింత సమాచారం తెలుసుకోండి: