ఏపీలో O2కి లోటు లేదు అని పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి వెల్లడించారు. ఆక్సిజన్ విషయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికే మొదటి ప్రాధాన్యత ఇస్తున్నామని అన్నారు. రాష్ట్ర అవసరాల తర్వాతే ఇతర రాష్ట్రాలకు సరఫరా చేస్తున్నామని తెలిపారు. సరఫరా జరుగుతున్న తీరును పర్యవేక్షించడానికి ప్రత్యేక అధికారులను నియమించామని చెప్పారు. ఏపీలో 40 రకాల పరిశ్రమల ద్వారా 510 ఎం.టీ మెడికల్ ఆక్సిజన్ తయారీ ఉంటుంది అన్నారు. కష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు జిల్లాలకు యుద్ధప్రాతిపదికన ఆక్సిజన్ సరఫరా చేయాలి అని సూచించారు.

కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్ర రాష్ట్రాల్లో ఆక్సిజన్ వినియోగం, ఉత్పత్తి, అవసరాలపైనా చర్చించిన మంత్రి గౌతమ్ రెడ్డి... రాష్ట్రంలో ముఖ్యంగా 3 చోట్ల నుంచి ఆక్సిజన్ సరఫరా ఉంటుందని వెల్లడించారు. ఆర్ఐఎన్ఎల్  ఆక్సిజన్ ఉత్పత్తిలో 50 శాతం ఆక్సిజన్ ను ఆంధ్రప్రదేశ్ వాటాగా తీసుకుంటోంది అని వెల్లడించారు. మిగతాది మహారాష్ట్రకు సరఫరా చేస్తుందిని పేర్కొన్నారు. మన రాష్ట్రానికి సరిపడా ఉన్నప్పుడే పొరుగు రాష్ట్రాలకూ సరఫరా చేయాలని మంత్రి స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు.

బళ్లారి నుంచి రావలసిన 68 ఎం.టీ ఆక్సిజన్ దిగుమతి వల్ల రాయలసీమకు ఉపశమనం కలిగింది అని వెల్లడించారు. కృష్ణా,  గుంటూరు, ప్రకాశం , కర్నూలులో కొంత భాగం, నెల్లూరులో మరికొంత భాగంలో ఆక్సిజన్ కొరతకు సంబంధించిన ఇబ్బందులు గుర్తించామని మంత్రి మేకపాటి వివరించారు. మెడ్ టెక్ జోన్ లో కూడా ఆక్సిజన్ ఉత్పత్తి జరుగుతుందని దాన్ని కూడా వినియోగించుకోవాలని మంత్రి మేకపాటి దిశానిర్దేశం చేసారు. మే 1వ తేదీ నుంచి రోజుకి 2400 క్యూబిక్ మీటర్ల సామర్థ్యంతో మెడ్ టెక్ నుంచి ఆక్సిజన్ ఉత్పత్తి చేస్తారని మెడ్ టెక్ జోన్ సీఈవో జితేంద్ర శర్మ వివరించారు. ఉత్తరాంధ్రలోని సుమారు 12 ఆసుపత్రులకు శ్రీకాకుళం జిల్లా లికినాక్స్ పరిశ్రమ నుంచి ఆక్సిజన్ సరఫరా ఉంటుందని అన్నారు. తయారు చేసినంత వేగంగా....తరలించకపోవడం ఆక్సిజన్ సరఫరాలో ప్రధాన సవాల్ గా మారిందని తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి: