జగన్ సీఎం గా వచ్చి దాదాపుగా రెండేళ్ళు అవుతోంది. ఇంతకాలం జగన్ ప్రాధాన్యతల క్రమంలో పనిచేసుకుంటూ వెళ్ళారు. ఆయన ఆలోచనలు తగినట్లుగానే పాలన సాగింది. ఇపుడు ఒక మైలు రాయి దగ్గరకు ప్రభుత్వ పాలన చేరుకుంది. మరో ఆరు నెలలు దాటితే సగం పాలన పూర్తి అవుతుంది.

దాంతో వచ్చే ఎన్నికలకు తక్కువ సమయమే ఉంటుంది. చివరి ఏడాది ఎటూ ఎన్నికల హడావుడి ఉంటుంది. అది కనుక తీసేస్తే  అచ్చంగా మరో రెండేళ్ళు మాత్రమే జగన్ చేతిలో ఉన్నట్లుగా లెక్క. దాంతో జగన్ ఇపుడు ఎమ్మెల్యేల మీద దృష్టి సారించారని అంటున్నారు. జనాలు 2019 ఎన్నికల వేళ  మెచ్చి 151 మంది ఎమ్మెల్యేలను గెలిపించి వైసీపీకి ఇచ్చారు. గత  రెండేళ్లలో నియోజకవర్గాలలో పెద్దగా అభివృద్ధి కార్యక్రమాలు ఏవీ జరగలేదు.

ఎమ్మెల్యేలు సైతం ఉత్సవ విగ్రహాల మాదిరిగానే ఉన్నారు. రేపటి రోజున ఎన్నికలకు వెళ్లి జనాలకు ఏం చేశామని చెప్పుకోవాలో వారికి అర్ధం కాని పరిస్థితి. దాంతో వారు అధినాయకత్వం  దగ్గర ఈ మాట చెప్పలేక మధనపడుతున్నారు. ఈ నేపధ్యంలో వారికి జగన్ తీపి కబురే వినిపించబోతున్నారుట. జగన్ విపక్ష నేతగా  13 నెలల పాటు ఏపీ వ్యాప్తంగా పాదయాత్ర చేశారు. ఆ సమయంలో ప్రతీ నియోజకవర్గంలో ఆయన పర్యటించారు. అక్కడ లోకల్ గా ఉన్న సమస్యలను కూడా ఆయన అడిగి తెలుసుకున్నారు. వాటిని పరిష్కారం చేస్తామని  కూడా హామీ ఇచ్చారు.

ఇపుడు ఆ హామీల బుట్టను బయటకు తీస్తున్నారుట. ప్రతీ నియోజకవర్గంలో ప్రధాన సమస్యల పరిష్కారం తో పాటు అభివృద్ధి కార్యక్రమాలను కూడా పెద్ద ఎత్తున  చేపట్టడానికి జగన్ రెడీ అవుతున్నారుట. వీటికి సంబంధించి ఎమ్మెల్యేలంతో కూడా ఆయన మాట్లాడి వారి ఆలోచనల మేరకు ప్రగతి పనులు పరుగులు పెట్టిస్తారు అంటున్నారు. మొత్తానికి చూస్తే ఎమ్మెల్యేల చేతుల మీదుగా ఆయన చోట్ల అభివృద్ధి జరిగితే రేపటి రోజున వారికే పేరు వస్తుంది. దాంతో ఎమ్మెల్యేలకు ఒక విధంగా ఇది శుభవార్తే అని అంటున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: