దేశంలో కరోనా వైరస్ అల్లకల్లోలం సృష్టిస్తుంది. ఈ మహమ్మారి బారిన పడి చాలా మంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఇది ఇలా ఉంటే మరికొంత మంది ఈ మహమ్మారి బారి నుండి కోలుకొని పలు ఆరోగ్య సమస్యలకు గురవుతున్నారు. కరోనా నుంచి కోలుకున్నా సంబంధిత వ్యక్తి శరీరంలోని షుగర్‌ లెవల్స్‌పై బ్లాక్‌ ఫంగస్‌ దాడి చేస్తోంది.

పూర్తి వివరాలోకి వెళ్తే..  ఒంగోలులోని సీతారాంపురంలో నివాసముంటున్న పందిపంట్ల శ్రీను అనే యువకుడు కరోనా నుంచి కోలుకున్న తర్వాత బ్లాక్‌ ఫంగస్‌ బారినపడి ఒక కనుగుడ్డును పూర్తిగా తొలగించేశారు. అయితే ఆ ఫంగస్‌ ఇంకా శరీరంలోనే ఉండటంతో రెండో కంటిపై కూడా ప్రభావం చూపే అవకాశాలు కనిపిస్తున్నాయి.

అయితే ప్రైవేట్‌ ఉద్యోగం చేస్తూ కరోనా కారణంగా ఉద్యోగం కోల్పోయిన ఆ వ్యక్తి.. చివరకు ఒక కన్నును కూడా కోల్పోయాడు. ప్రస్తుతం చెన్నైలోని సిమ్స్‌ హాస్పిటల్‌ ఐసీయూలో చికిత్స పొందుతున్నాడు. వైద్యానికి దాదాపు రూ.18 లక్షల వరకు ఖర్చువుతుందని చెప్పడంతో శ్రీను భార్య మాలతి ఆపన్నహస్తం కోసం ఎదురుచూస్తోంది. ప్రస్తుతం ఆరో నెల గర్భిణి అయిన మాలతి కందుకూరులోని తన తండ్రి వద్ద ఉంటోంది. తల్లి చనిపోవడంతో తండ్రి వద్దనే ఉంటోంది.

ఇక శ్రీను కరోనా బారిన పడటంతో గత నెల 21వ తేదీ కందుకూరులోని ప్రభుత్వాసుపత్రిలో చేరాడు. వారం రోజుల తర్వాత 28వ తేదీ డిశ్చార్జి చేశారు. ఆ తరవాత కన్ను వాసి ఎర్రగా ఉండటంతో కందుకూరులోని ఈఎన్‌టీ ఆస్పత్రికి వెళితే కంటిలో రక్తం గడ్డ కట్టిందని హైదరాబాద్‌ వెళ్లాలని వైద్యుడు సూచించారు. అయితే ఏ హాస్పిటల్ లోను అతడిని జాయిన్ చేసుకోలేదు.

చివరికి చెన్నైలోని సిమ్స్‌ హాస్పిటల్‌లో బ్లాక్‌ ఫంగస్‌తో ప్రాణాపాయ స్థితిలో ఉన్న తన భర్తను కాపాడాలంటూ మాలతి వేడుకుంటోంది. వైద్యానికి మొత్తం రూ.18లక్షల ఖర్చవుతుందని, ఎవరైనా దాతలు సాయంచేసి తన భర్త ప్రాణాలను కాపాడాలని కోరుతోంది. ఆరునెలల గర్భిణి యిన మాలతి పుట్టబోయే బిడ్డ గురించి కలలు కనడం కంటే, కంటి ముందే ప్రాణాపాయంతో కొట్టుమిట్టాడుతున్న భర్త ప్రాణాలను ఎలా కాపాడుకోవాలో తెలియక నరకయాతన అనుభవిస్తోంది. సాయం చేయాలనుకునేవారు 779486521 నంబర్‌ను సంప్రదించాలని కోరారు.

మరింత సమాచారం తెలుసుకోండి: