ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్మోహ‌న్‌రెడ్డి, సీబీఐ అధికారుల‌పై తాజాగా విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి. జ‌గ‌న్ బెయిల్ ర‌ద్దుచేయాలంటూ న‌ర‌సాపురం ఎంపీ ర‌ఘురామ‌కృష్ణంరాజు పిటిష‌న్ వేసిన సంగ‌తి తెలిసిందే. దీనిపై కౌంట‌ర్ దాఖ‌లు చేయ‌డానికి న్యాయ‌వాదులు స‌మ‌యం కోర‌డంతో సీబీఐ కోర్టు కేసు విచార‌ణ‌ను ఈనెల 26వ తేదీకి వాయిదా వేసిన సంగ‌తి తెలిసిందే. ఇదే చివ‌రి అవ‌కాశ‌మ‌ని కోర్టు కూడా స్ప‌ష్టం చేయ‌డంతో ఈ వారంరోజుల్లో ఏం జ‌ర‌గ‌నుంద‌నేది ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆస‌క్తిక‌రంగా మారింది.

సోష‌ల్ మీడియాలో వ్యంగ్యాస్త్రాలు
కౌంట‌ర్ దాఖ‌లు చేయ‌డానికి సీబీఐకి ఎంత గ‌డువిచ్చినా స‌రిపోవ‌డంలేద‌ని సోష‌ల్ మీడియాలో వ్యంగ్యాస్త్రాలు పేలుతున్నాయి. గ‌తంలో కొన్ని వాయిదాల స‌మ‌యంలో ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ ఢిల్లీ వెళ్లేవార‌ని.. ప్ర‌ధాన‌మంత్రి మోడీని ప్ర‌స‌న్నం చేసుకునేప‌నిలో బిజీగా ఉండేవార‌ని.. తాజాగా సీబీఐ కోర్టు ఇచ్చిన వారం స‌మ‌యం కూడా స‌రిపోతుందో?  లేదో? అంటూ నెటిజ‌న్లు పంచ్‌లు వేస్తున్నారు. బెయిల్ పిటిషన్ విచారణ వాయిదా కోసమే మోడీని జగన్ పొగిడారని.. జార్కండ్ ముఖ్య‌మంత్రి ప్ర‌క‌ట‌నకు వ్య‌తిరేకంగా స్పందించార‌ని గుర్తుచేస్తున్నారు. కౌంటర్‌ దాఖలు చేయాలి అనుకుంటే ఎంతో స‌మ‌యం కూడా ప‌ట్ట‌ద‌ని.. మ‌న‌సు పెడితే రెండు గంట‌ల్లో పూర్త‌వుతుంద‌ని.. కానీ ఉద్దేశ‌పూర్వ‌కంగా జాప్యం చేస్తుండ‌ట‌మ‌నేదే ఇక్క‌డ స్ప‌ష్ట‌మ‌వుతోంద‌ని రాజ‌కీయ విశ్లేష‌కులు, సీనియ‌ర్ జ‌ర్న‌లిస్టులు అభిప్రాయ‌ప‌డుతున్నారు. ముఖ్య‌మంత్రి జ‌గ‌న్మోహ‌న్‌రెడ్డితో సంబంధం లేకుండా సీబీఐ ఎందుకు కౌంట‌ర్ దాఖ‌లు చేయ‌డంలేద‌ని ప్ర‌శ్నిస్తున్నారు.

సీబీఐ కోర్టు కీల‌క వ్యాఖ్య‌లు!!
ముఖ్య‌మంత్రి జ‌గ‌న్మోహ‌న్‌రెడ్డి బెయిల్ ర‌ద్దుచేయాల‌ని, విచార‌ణ వేగ‌వంతంగా పూర్తిచేయాలంటూ ఎంపీ ర‌ఘురామ సీబీఐ కోర్టులో పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. దీనిపై కౌంట‌ర్ దాఖ‌లు చేయాలంటూ సీబీఐ అధికారులు, జగన్‌ను కోర్టు గ‌తంలోనే ఆదేశించింది. అయితే ఇప్ప‌టివ‌ర‌కు వారు కౌంట‌ర్ దాఖ‌లు చేయ‌లేదు. తాజాగా ఈరోజు విచార‌ణ చేప‌ట్టిన కోర్టు కీల‌క వ్యాఖ్య‌లు చేసింది. కౌంట‌ర్ దాఖ‌లు చేయ‌డానికి ఇదే చివ‌రి అవ‌కాశ‌మ‌ని స్ప‌ష్టం చేసింది. త‌దుప‌రి విచార‌ణ‌ను 26వ తేదీకి వాయిదా వేస్తున్న‌ట్లు తెలిపింది.


మరింత సమాచారం తెలుసుకోండి: