ఆర్థిక, రాజకీయ రంగాల్లో కోబ్రా ఎఫెక్ట్ అనే పదం ఎక్కువగా వినిపిస్తుంది. మనం ఏదైనా ఓ సమస్యను అధిగమించడానికి ఒక ఉపాయం ఆచరణలో పెడితే.. ఆ ఉపాయం వల్ల సమస్య తీరకపోవడం అటుంచితే.. ఆ సమస్య మరింత పెద్దదవుతుంది. దీన్నే కోబ్రా ఎఫెక్ట్ అంటారు. అయితే అప్పట్లో భారతదేశంలో ఢిల్లీని బ్రిటిష్ వారు పరిపాలించేవారు. ఆ సమయంలోనే బ్రిటిషర్లు వేసిన ఒక ఉపాయం ఎదురు తన్నడంతో దాన్నే కోబ్రా ఎఫెక్ట్ గా పిలవడం ప్రారంభించారు.


వివరంగా తెలుసుకుంటే.. బ్రిటిషర్లు ఇండియాని పాలిస్తున్న రోజుల్లో ఢిల్లీలో అత్యంత విషపూరితమైన పాములు రోడ్లమీద తిరిగేవి. దీంతో బ్రిటిషు వారు తమ నివాసాల నుంచి బయట అడుగుపెట్టాలంటేనే భయపడిపోయారు. తమ ఆఫీసులలో కూడా పాముల  ఉంటాయేమోనని భయంతో గజగజ వణికిపోయేవారు. ఐతే పాముల బెడద నుంచి ఉపశమనం పొందడానికి అప్పటి బ్రిటిష్ ప్రభుత్వం.. ఎవరైతే పాములను చంపి తెస్తారో వారికొక వెండి నాణెం ఇస్తామని ప్రకటించింది.



దీంతో భారతీయులు పాములను చంపడం.. ప్రభుత్వానికి అప్పజెప్పడం.. వెండి నాణాలు బహుమతిగా తీసుకోవడం ప్రారంభించారు. అయితే కాలక్రమేణా భారతీయులు ప్రతి రోజూ వందల సంఖ్యలో పాములను చంపడం.. ప్రభుత్వానికి పాముల చర్మాన్ని ఇచ్చేయడం.. బహుమతులు పుచ్చుకోవడం ఒక కార్యం లా మారిపోయింది. అయితే పాముల సంఖ్య తగ్గడానికి బదులుగా రోజురోజుకూ వాటి సంఖ్య పెరిగిపోయింది. దీంతో అసలు ఏం జరుగుతుందోననే ప్రభుత్వం ఆరా తీయగా ఢిల్లీ వాసులు పాములు పెంచి పోషించడం ప్రారంభించారని తెలిసింది. దీంతో ఒక్కసారిగా బ్రిటిష్ అధికారులు షాక్ అయ్యారు.



వెంటనే ఎవరూ కూడా పాములు పెంచొద్దని.. ఇకపై చంపిన పాములకు తాము ఎటువంటి బహుమతులు ఇవ్వమని ప్రకటించారు. దీంతో ఢిల్లీ వాసులు తమకు ఉపయోగంలేని పాములను అడవులలో వదిలేశారు. కొందరు నగరంలోనే వదిలివేశారు. దీంతో బ్రిటిష్ ప్రభుత్వం యొక్క ఉపాయం బెడిసికొట్టి సమస్య మరింత తీవ్రతరమైంది. ఐతే పాముల విషయంలో వేసిన ఓ ఉపాయం ఈ విధంగా బెడిసికొట్టడంతో.. ఆంగ్లేయులు ఇటువంటి పరిస్థితులను వర్ణించడానికి కోబ్రా ఎఫెక్ట్ అని పేరు పెట్టారు. ఇక అప్పటినుంచి కోబ్రా ఎఫెక్ట్ అనే పదం బాగా పాపులర్ అయ్యింది.



కోబ్రా ఎఫెక్ట్ అనేది ఢిల్లీలోనే కాదు వియత్నాం దేశంలో కూడా జరిగింది. అప్పట్లో వియత్నాం దేశాన్ని ఫ్రాన్స్ వారు పరిపాలించేవారు. అయితే ఆ కాలంలో ఎలకల కారణంగా ప్లేగు వ్యాధి విపరీతంగా వ్యాప్తి చెందుతున్నడంతో ఫ్రాన్స్ అధికారులు ఎలుకలను చంపి వేయాలని నిర్ణయించారు. ఐతే హనొయ్‌ నగరంలో ఎక్కువగా ఎలుకలున్నాయని గుర్తించారు. దీంతో ఆ నగర వాసుల్లో ఎవరైతే ఎలుకలను చంపి వాటి తోకలను తెస్తారో.. వారికి డబ్బులు ఇస్తామని ఫ్రాన్స్ అధికారులు ప్రకటించారు. ఇది తెలుసుకున్న వియత్నాం ప్రజలు చాలా ఎలుక తోకలని తెచ్చి డబ్బులు పొందారు. ఐతే నగరంలో తోకలు లేని ఎలకలు ఎంచక్కా సంచరిస్తుంటే అనుమానం వచ్చిన అధికారులు ఆరా తీశారు. ఐతే వియత్నాం ప్రజలు ఎలుకలను చంపేతే.. వాటి సంతాన ఉత్పత్తి తగ్గిపోయి.. చివరికి ఒక్క ఎలుక కూడా ఉండదని.. దానివల్ల తమకు కొత్త ఎలుకలు దొరకవని.. అప్పుడు డబ్బులు కూడా రావని భావించి ఎలకలను చంపకుండా కేవలం వాటి తోకలనే కత్తిరించారని అధికారులకు తెలిసింది.

మరింత సమాచారం తెలుసుకోండి: