దగ్గుబాటి వెంకటేశ్వరరావు.....తెలుగు ప్రజలకు సుపరిచితమైన పేరు. ఎన్టీఆర్ పెద్దల్లుడుగా రాజకీయాల్లోకి వచ్చిన దగ్గుబాటి, కొన్నేళ్లు టీడీపీలో కీలక పాత్ర పోషించిన విషయం తెలిసిందే. అయితే ఎన్టీఆర్‌ని గద్దె దింపి చంద్రబాబు టీడీపీ పగ్గాలు, సీఎం పీఠం దక్కించుకున్నాక దగ్గుబాటి పూర్తిగా సైడ్ అయిపోయారు. భార్య పురంధేశ్వరితో కలిసి కాంగ్రెస్‌లోకి వెళ్ళిపోయారు. ఇక కాంగ్రెస్‌లో భార్యాభర్తలకు మంచి పొజిషన్ దక్కింది.


ఇక 2004, 2009 సమయాల్లో కాంగ్రెస్ అధికారంలో ఉండటంతో దగ్గుబాటి ఫ్యామిలీకి తిరుగులేకుండా పోయింది. అయితే ఎప్పుడైతే రాష్ట్ర విభజన జరిగి ఏపీలో కాంగ్రెస్ క్లోజ్ అయిందో అప్పటినుంచి దగ్గుబాటి ఫ్యామిలీ రాజకీయ భవిష్యత్ దెబ్బతింది. 2014లో పురంధేశ్వరి కాంగ్రెస్‌ని వీడి బీజేపీలోకి వెళ్ళి సెటిల్ అయ్యారు.


ఇక వెంకటేశ్వరరావు రాజకీయాలకు దూరమయ్యారు. అయితే అనూహ్యంగా 2019 ఎన్నికల ముందు తన వారసుడు కోసం మళ్ళీ రాజకీయాల్లోకి వచ్చారు. తన తనయుడు హితేష్‌ని వైసీపీలో చేర్చి పర్చూరు టిక్కెట్ కూడా తెచ్చుకున్నారు. కానీ విదేశీ పౌరసత్వం రద్దు కాకపోవడంతో హితేష్ పోటీ చేయడం కుదరలేదు. దీంతో దగ్గుబాటి వైసీపీ తరుపున పర్చూరులో పోటీ చేశారు. ఇక రాష్ట్రమంతా జగన్ గాలి ఉన్నా సరే పర్చూరులో టీడీపీ జెండా ఎగిరింది. దగ్గుబాటి ఓటమి పాలయ్యారు.


అటు పురంధేశ్వరి బీజేపీ నుంచి విశాఖ ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు. ఇలా భార్యాభర్తలు ఇద్దరు వేరు వేరు పార్టీల్లో ఉండి ఓటమి పాలయ్యారు. ఓడిపోయాక పురంధేశ్వరి బీజేపీలో కొనసాగుతుండగా, దగ్గుబాటి మాత్రం మళ్ళీ రాజకీయాలకు దూరమయ్యారు. అటు జగన్ కూడా దగ్గుబాటిని లైట్ తీసుకుని, పర్చూరుకు రావి రామనాథంబాబుని మళ్ళీ ఇన్‌చార్జ్‌గా పెట్టారు.


అయితే ఎన్నికలైన దగ్గర నుంచి దగ్గుబాటి మళ్ళీ ఏపీ పోలిటికల్ స్క్రీన్‌పై కనిపించడం లేదు. ఇక భవిష్యత్‌లో కూడా కనిపించడం కష్టమే అని తెలుస్తోంది. ఇక వారసుడు భవిష్యత్ పురంధేశ్వరి చూసుకునే అవకాశం ఉంది. మొత్తానికైతే ఏపీ రాజకీయాల్లో దగ్గుబాటి చాప్టర్ క్లోజ్ అయినట్లే అనుకుంటా!

మరింత సమాచారం తెలుసుకోండి: