థర్డ్ వేవ్ ప్రభావం ఎవరిపై ఉంటుంది, ఎప్పుడు మొదలవుతుంది అనేదానిపై ఇటీవల పలు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా పిల్లలపై ఎక్కువ ప్రభావం చూపుతుందని చాలామంది నిపుణులు తేల్చి చెప్పారు. అయితే సెకండ్ వేవ్ బలహీన పడే క్రమంలో ఆ వాదనలన్నీ తప్పని తేలుతున్నాయి. తాజాగా ఢిల్లీలోని ఎయిమ్స్ చేపట్టిన అధ్యయనంలో కొవిడ్ వైరస్ పిల్లలపై ప్రత్యేక ప్రభావం చూపుతుందనే విషయం తప్పని తేలింది. కొవిడ్ వైరస్ ప్రభావానికి వయస్సుకి సంబంధం లేదని ఎయిమ్స్ లేటెస్ట్ స్డడీ చెబుతోంది.

ఇప్పటి వరకూ భారత్ లో కరోనా వైరస్ సోకిన వారిపై చేపట్టిన సర్వేలన్నీ జనాభా ప్రాతిపదికనే జరిగాయి. పిల్లలు, పెద్దలు వృద్ధులు.. ఇలా అందరిలోనూ ఈ లక్షణాలు కనిపించినా.. చిన్న పిల్లల జనాభా నిష్పత్తి ప్రకారం వారి శాతం ఎక్కువగా కనిపించింది. అదే సమయంలో పెద్దవారిపై కూడా కరోనా తీవ్ర ప్రభావాన్ని చూపించింది. కానకీ జనాభా ప్రాతిపదికన తీసుకుంటే.. చిన్నారుల్లో ఆ ప్రభావం ఎక్కువగా కనిపించినట్టయింది. కానీ వాస్తవంలో.. 2ఏళ్లు అంతకంటే ఎక్కువ ఉన్న పిల్లలు, 18 సంవత్సరాలు పైబడినవారిని పోల్చి చూస్తే.. అన్ని వయసుల వారినీ కొవిడ్ సమానంగా ప్రభావితం చేసినట్టు తేలింది.


 

ఈ ఏడాది మార్చి 15నుంచి జూన్ 10వరకు ఎయిమ్స్ వైద్య నిపుణులు చేపట్టిన అధ్యయనంలో ఈ విషయం స్పష్టంగా బయటపడింది. కొవిడ్ వైరస్ ప్రత్యేకించి పిల్లలపై ఎక్కువ ప్రభావం చూపే అవకాశమే లేదని వారు తేల్చి చెప్పారు. థర్డ్ వేవ్ వచ్చినా, రాకపోయినా పిల్లలు డేంజర్ జోన్ లో ఉంటానే విషయాన్ని ఎయిమ్స్ ఖండించింది.

మరోవైపు థర్డ్ వేవ్ నేపథ్యంలో వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు చిన్న పిల్లల వైద్యానికి ఎక్కువ ప్రాధాన్యతనిచ్చేలా ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నాయి. ఆయా ప్రాంతాల్లో చిన్న పిల్లల ఆస్పత్రులు ఏర్పాటు చేస్తున్నాయి. వారికి ప్రత్యేకంగా పడకలు సిద్ధం చేస్తున్నాయి. చిన్నపిల్లల వైద్య నిపుణుల నియామకాలు కూడా కార్పొరేట్ ఆస్పత్రుల్లో ఇటీవల బాగా పెరిగాయి. థర్డ్ వేవ్ భయంతోనే ఇదంతా. అయితే ఇప్పుడు ఎయిమ్స్ సర్వే మాత్రం చిన్న పిల్లలకు భయం లేదని భరోసా ఇస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: