ప్రభుత్వం అంటే నిరంతరాయంగా సాగే వ్యవస్థ. మధ్యలో పార్టీలు వస్తాయి. రాజకీయాలు ఉంటాయి. వాటి పాలసీలు ఉంటాయి. కానీ కొన్ని కీలక నిర్ణయాలు కోట్లాది మంది జనంతో ముడి పడిన అంశాల జోలికి అయితే ఎవరూ పోరు. కానీ ఏపీలో ఒక విడ్డూరమే జరిగింది.

అమరావతి రాజధాని విషయంలో వైసీపీ అడ్డం తిరిగింది. మూడు రాజధానులను ముందుకు తీసుకువచ్చింది. అమరావతి రాజధానిని  మూడవ వంతుకే పరిమితం చేస్తామని కూడా స్పష్టం చేసింది. అది లగాయితూ అమరావతి రైతుల ఆందోళన సాగుతూనే ఉంది. అది తాజాగా 550 రోజుల మార్క్ ని చేరుకుంది. ప్రపంచంలో ఇంత సుదీర్ఘంగా ఆందోళన సాగిన చరిత్ర లేదు, అందుకే ఇది కొత్త రికార్డుని సృష్టించింది.  మరో ఆరు నెలల్లో అమరావతి ఉద్యమానికి రెండేళ్ళు అవుతోంది.

ఏపీలో మూడు రాజధానులను ఏర్పాటు చేస్తున్నట్లుగా జగన్ 2019 డిసెంబర్ 17న అసెంబ్లీ  శీతాకాల సమావేశాల సందర్భంగా ప్రకటన చేశారు. ఆ మరుసటి రోజు నుంచే అమరావతి రైతులు ఆందోళన బాట పట్టారు. మొత్తం 29 గ్రామాల ప్రజలు వేలాది రైతులతో మొదలైన ఈ ఆందోళన నేటికీ కొనసాగుతోంది. మొదట్లో తెలుగుదేశం పార్టీ గట్టి మద్దతు ఇచ్చింది. అలాగే బీజేపీ, జనసేన, వామపక్షాలు, కాంగ్రెస్ ఇలా అన్ని రాజకీయ పార్టీలు కూడా అమరావతి ఆందోళనకు తమ పూర్తి అండదండలు అందించారు.

కానీ కాలక్రమేణా రాజకీయ మద్దతు తగ్గిపోయింది. దానికి ఎన్నికల రాజకీయం కూడా కారణం కావచ్చేమో. అమరావతి సహా అన్ని చోట్ల కూడా వైసీపీయే తాజాగా జరిగిన లోకల్ బాడీ ఎన్నికల్లో గెలిచింది. దాంతో ప్రధాన పార్టీలు కొంత వెనకడుగు వేశాయి. కానీ రైతులు మాత్రం నిరాటంకంగా ఉద్యమాన్ని కొనసాగిస్తున్నారు. వారు రాజకీయ పార్టీల మీద నమ్మకం పెట్టుకోలేదు. న్యాయ స్థానం వైపే వారి చూపు ఉంది. అక్కడ మూడు రాజధానుల మీద తీర్పు తమకు అనుకూలంగా వస్తుంది అన్నది వారి ఆశగా ఉంది. మొత్తానికి గత ప్రభుత్వ హయాంలో నిత్యం అమరావతి ప్రస్తావన వచ్చేది, ఇపుడు అమరావతి అంటే ఆందోళన, కన్నీటి గాధలే గుర్తుకు వస్తున్నాయి.





మరింత సమాచారం తెలుసుకోండి: