మాస్ వ్యాక్సినేషన్ తో సరికొత్త రికార్డు సృష్టించిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.. భవిష్యత్తులో ఏపీకి ఎక్కువ వ్యాక్సిన్ల కేటాయింపుకోసం ప్రయత్నాలు మొదలు పెట్టింది. వ్యాక్సిన్ సామర్థ్యాన్ని పరిగణలోకి తీసుకుని డోసులను కేంద్రం అందించగలిగితే, ఏపీకి ఎక్కువ సంఖ్యలో వ్యాక్సిన్ డోసులు వచ్చే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు అధికారులు. దీనికోసం ఇలా మాస్ వ్యాక్సినేషన్ డ్రైవ్ లు ఏర్పాటు చేసి, ఏపీ సత్తా చాటిచెబుతున్నారు. గతంలో తన రికార్డుని తానే అధిగమించిన ఏపీ.. ఒక్కరోజులోనే 11.85లక్షలమందికి టీకాలు వేసి సరికొత్త రికార్డు సృష్టించింది. దాదాపుగా అన్ని జిల్లాలకు టార్గెట్లు విధించి ఈ మాస్ వ్యాక్సినేషన్ డ్రైవ్ ని విజయవంతం చేయగలిగారు అధికారులు. ఎక్కడా ప్రజలు వేచి చూసే ఇబ్బంది లేకుండా.. వచ్చినవారికి వచ్చినట్టు వ్యాక్సిన్ ఇచ్చి పంపించేశారు. దీనికోసం గత వారం రోజులుగా వైద్య, ఆరోగ్య శాఖ సిబ్బంది సన్నాహాలు చేసుకున్నారు. మెగా వ్యాక్సినేషన్ డ్రైవ్ ని విజయవంతం చేశారు.

రాష్ట్రంలో ఇప్పటి వరకు సుమారు 96లక్షలమందికి టీకా మొదటి డోసు వేశారు. ఈమేరకు  మాస్ వ్యాక్సినేషన్ డ్రైవ్ అనంతరం వైద్య ఆరోగ్య శాఖ కార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్ వివరాలు తెలియజేశారు. గతంలో ఏపీలో ఒకేరోజు ఆరు లక్షలమందికి టీకా ఇచ్చారు. ఇప్పుడు ఆ రికార్డు అధిగమిస్తూ మొత్తం 11లక్షల 85 వేలమందికి టీకాలు వేశారు.

థర్డ్ వేవ్ ని ఎదుర్కొనేందుకు సన్నద్ధం..
థర్డ్ వేవ్ ని ఎదుర్కొనేందుకు ఏపీ ప్రభుత్వం సన్నద్ధంగా ఉందని తెలియజేశారు అనిల్ కుమార్ సింఘాల్. రాష్ట్రంలో కొవిడ్ కేసులు క్రమంగా తగ్గుతున్నాయని, రాబోయే రోజుల్లో మరింతగా కేసుల సంఖ్య పడిపోతుందని చెప్పారు. థర్డ్ వేవ్ పిల్లలపై అధిక ప్రభావం చూపుతుందనే విషయాన్ని ఆయన కొట్టిపారేశారు. ఎయిమ్స్ వైద్యులు కూడా థర్డ్ వేవ్ పిల్లలపై అధిక ప్రభావం చూపిస్తుందనేది కేవలం ఊహాగానమేనని చెప్పారని పేర్కొన్నారు. అయితే ముందస్తు చర్యల్లో భాగంగా మందులు, ఇంజెక్షన్లు, ఆక్సిజన్ సిలిండర్లను అందుబాటులో ఉంచుతున్నట్టు చెప్పారు అనిల్ కుమార్ సింఘాల్. మరోవైపు బ్లాక్ ఫంగస్ చికిత్స విషయంలో కూడా ఏపీ ప్రభుత్వం అప్రమత్తంగా ఉందని, 60వేల ఆంఫోటెరిసిన్-బి ఇంజెక్షన్లు ఆర్డర్ చేసినట్టు ఆయన చెప్పారు.


మరింత సమాచారం తెలుసుకోండి: