కరోనా వ్యాక్సిన్ పై రకరకాల ఊహాగానాలు, పుకార్లు సోషల్ మీడియాలో కో కొల్లలు. ఫలానా వ్యాక్సిన్ బెస్ట్, ఫలానా వ్యాక్సిన్ వేస్ట్.. అనే వార్తలయితే లెక్కకు మిక్కిలి కనపడతాయి. అయితే ఇప్పుడు కొత్తగా అమెరికాలో మరో పుకారు మొదలైంది. కరోనా వ్యాక్సిన్ లో మైక్రో చిప్ అమరుస్తున్నారని, దాన్ని మనిషి శరీరంలో ఎక్కించి వారిని ట్రాక్ చేస్తున్నారనేది దాని సారాంశం.

అసలేంటీ సిద్ధాంతం.. ఇది ఎక్కడ మొదలైంది..?
సోషల్ మీడియా ద్వారా అమెరికాలో ఈ పుకారుని ఓ సరికొత్త సిద్ధాంతం పేరుతో ప్రచారం చేస్తున్నారు కొంతమంది. గతంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రతినిధులు కూడా ఇలాంటి తప్పుడు వార్తలపై స్పందించారు. మనం కేవలం వైరస్ తోనే కాదు, తప్పుడు ప్రచారాలు, కుట్రలపై కూడా యుద్ధం చేస్తున్నామని డబ్ల్యూహెచ్ ఓ ప్రకటించింది. అయితే అమెరికాలో మొదలైన కొత్త పుకారు మాత్రం మరింత విచిత్రంగా ఉండటం విశేషం.

సర్వేలో విస్తుపోయే నిజాలు..
అమెరికాలో జరుగుతున్న ఈ పుకారుపై మైగావ్ అనే సంస్థ స్థానిక మీడియాతో కలసి ఓ సర్వే నిర్వహించింది. దాదాపు 20శాతం మంది అమెరికన్లు వ్యాక్సిన్ లో మైక్రో చిప్ ఉంటుందని విశ్వసిస్తున్నారని ఈ సర్వే చెబుతోంది. 7శాతం మంది మైక్రో చిప్ ఉందని పక్కాగా వాదిస్తుంటే, 46శాతం మంది ఇది తప్పుడు సమాచారం అని కొట్టిపారేశారు. ఎక్కువగా 30నుంచి 44 సంవత్సరాల మధ్య వయసువారు ఈ పుకారుని నమ్ముతున్నారట. అయితే అమెరికాలో వ్యాక్సిన్ వేయించుకోడానికి వెనకాడుతున్న వారిలో 51శాతం మంది మైక్రోచిప్ ఉందనే భయంతోనే దాని జోలికి వెళ్లడం లేదని తెలుస్తోంది.

అయితే ఈ సిద్ధాంతం తప్పని, కరోనా వ్యాక్సిన్లలో మైక్రో చిప్ పెడుతున్నారని చెప్పేందుకు ఎలాంటి ఆధారాలు లేవని నిపుణులు కొట్టిపారేస్తున్నారు. గతంలో కూడా అమెరికాలో ఇలాంటి తప్పుడు ప్రచారాలు బాగానే జరిగాయి. వ్యాక్సిన్ వల్ల సెక్స్ సామర్థ్యం తగ్గుతుందని, పిల్లలు పుట్టరని కూడా అప్పట్లో పుకార్లు వచ్చాయి. దీంతో యువత వ్యాక్సిన్లకు దూరమైంది. దీనిపై ఇప్పుడిప్పుడే జనాల్లో అవగాహన పెరుగుతోంది. అయితే ఇప్పుడు మరో కొత్త పుకారు అమెరికాను హడలెత్తిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: