దేశం నిండా ప్రాంతీయ పార్టీలు ఉన్నాయి. ఈ దేశంలో బలమైన జాతీయ పార్టీలుగా కాంగ్రెస్, బీజేపీ ఉన్నాయి. కానీ వాటి ప్రభావం అంతా మొత్తం 543 సీట్లకు గానూ 300 లోపే అంటారు. మిగిలిన చోట్ల అంతా కూడా ప్రాంతీయ పార్టీలే విస్తరించాయి.

ఒక విధంగా చూస్తే సమాఖ్య స్పూర్తికి అద్దం పట్టేలా ప్రతీ రాష్ట్రంలో రెండేసి మూడేసి ప్రాంతీయ పార్టీలు పుట్టుకువస్తున్నాయి. ఇది జాతీయ పార్టీల వైఫల్యంగా కూడా చెప్పాలి. ప్రాంతీయ ఆక్షాంక్షలకు దూరంగా జాతీయ పార్టీలు ఉండడం వల్లనే ఇవి ఏర్పాటు అవుతున్నాయి. ఇక ఒకసారి ప్రాంతీయ పార్టీ ఏర్పాటు అయితే దాన్ని ఓడించడం, మనుగడ లేకుండా చేయడం కష్టమే.  తెలుగు రాష్ట్రాలే ఇందుకు ఉదాహరణ.  ఉమ్మడి ఏపీలో కాంగ్రెస్ నాడు తెలుగుదేశానికి గట్టిగా పోటీ ఇవ్వలేకపోయింది.

విభజన తరువాత అటు టీయారెస్. ఇటు వైసీపీతో కలుపుకుని టీడీపీ సహా మూడు ప్రాంతీయ పార్టీలు అయ్యాయి. దాంతో జాతీయ పార్టీలకు తెలుగు నేల మీద అసలు  కాలూనడానికి కూడా చోటు లేకుండా పోతోంది. ఇవన్నీ ఇలా ఉంటే 2024 ఎన్నికల గురించి ఇప్పటి నుంచే పెద్ద చర్చ సాగుతోంది. వచ్చే ఎన్నికల్లో బీజేపీకి అసలైన పోటీ కాంగ్రెస్ నుంచి కాదు ప్రాంతీయ పార్టీల నుంచే అని వినిపిస్తోంది. ఈ నేపధ్యంలో మమతా బెనర్జీ కూడా ప్రాంతీయ పార్టీలను కూటమిగా చేయాలని సీరియస్ గానే  చూస్తున్నారు. ఇక బీజేపీతో దశాబ్దాల మైత్రిని నెరపిన శిరోమణీ అకాలీదల్ ఇపుడు యాంటీ మోడీ స్టాండ్ తీసుకుంది.

ఆ పార్టీ తాజాగా ఒక పిలుపు ఇచ్చింది. అదేంటి అంటే యాంటీ మోడీ నినాదంతో దేశంలోని ప్రాంతీయ పార్టీలు అన్నీ ఒక్కటి కావాలని. అలా చేస్తేనే బీజేపీని గద్దె దించగలమని కూడా ఆ పార్టీ అంటోంది. మరి అది సాధ్యమేనా. బీజేపీ పట్ల పూర్తి వ్యతిరేకతతో అన్ని పార్టీలు ఉన్నా కూడా ఇవన్నీ కలసి ఒక గొడుకు కిందకు చేరడం సంభవమేనా అన్నదే ప్రశ్న. చూడాలి మరి.


మరింత సమాచారం తెలుసుకోండి: