భారతీయ జనతా పార్టీలో ప్రస్తుతం అందరి మదిలో ఉన్న ప్రశ్న  ఒకటే... దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ భవిష్యత్తు ఏమిటీ. పార్టీకి చెందిన ఏ నలుగురు కలుసుకున్నా ఈ విషయంపైనే చర్చ. అసలు మోదీ పరిస్థితి ఏమిటీ... నిన్న మొన్నటి వరకు ఎవరికీ లేని ఆలోచన... శుక్రవారం నుంచే అందరి మదిని తొలిచేస్తుంది. భారతీయ జనతా పార్టీని ఒంటిచేత్తో రెండు సార్లు అధికారంలోకి తీసుకువచ్చిన నేతగా... మోస్ట్ ఇన్‌ఫ్లూయన్స్ పీపుల్స్ జాబితాలో చోటు దక్కించుకున్న నరేంద్ర మోదీ అంటే... పార్టీలో అందరికీ విపరీతమైన గౌరవం. ఆయన ప్రసంగం ప్రజలను మైమరిపిస్తుంది. ఇంకా చెప్పాలంటే... మోదీ గారు మా నియోజకవర్గంలో ఒక సభ నిర్వహిస్తే చాలు... మేము గెలిచినట్లే... అంటారు  ఆ పార్టీ నేతలు. 2014 ఎన్నికల్లో నమో భారత్ అనే నినాదంతో ప్రచారం మొదలు పెట్టిన భారతీయ జనతా పార్టీ... తిరుగులేని మెజారిటీ సాధించింది. ఇంకా చెప్పాలంటే... 130 ఏళ్ల కాంగ్రెస్ పార్టీకి పార్లమెంట్‌లో కనీస ప్రతిపక్ష హోదా దక్కకుండా చేసింది. ఆ తర్వాత జరిగిన 2019 ఎన్నికల్లో అయితే...తొలిసారి పూర్తిస్ధాయి మెజారిటీ సాధించిన బీజేపీ.... పార్లమెంట్‌పై కాషాయ జెండా రెపరెపలాడేలా చేశారు మోదీ సారు.

అధికారంలోకి వచ్చిన తర్వాత నమామి గంగే, అయోధ్య రామమందిర నిర్మాణం, స్వచ్ఛ భారత్, మేకిన్ ఇండియా, ఆత్మ నిర్భర్ భారత్ అంటూ ఎన్నో పథకాలను అమలు చేసిన అటు ప్రజల్లో కూడా తనదైన గుర్తింపు సంపాదించారు. అలాగే ప్రపంచ దేశాల సరసన భారత్‌ను నిలబెట్టి... అన్ని దేశాధినేతలతో వాహ్ మోదీజీ అనిపించుకున్నారు కూడా. అయితే ప్రస్తుతం మోదీ వయసే ఆయన భవిష్యత్తుకు అడ్డంకిగా మారింది. సాధారణంగా బీజేపీలో కొన్ని పరిమితులు ఉన్నాయి. ఏ స్థాయి నాయకుడైనా సరే... ఒక వయసు వరకు మాత్రమే పదవిలో ఉండాలి. ఆ తర్వాత నుంచి తప్పుకోవాలి. ఇదే నియమంతో గతంలో ఎందరో మహామహులు కూడా ప్రత్యక్ష రాజకీయాలకు దూరమయ్యారు. పార్టీని తమ భుజస్కందాలపై మోసి... ఈ స్థాయికి వచ్చేందుకు బలమైన పునాదులు వేసిన మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయ్, కేంద్ర మాజీ మంత్రి ఎల్.కే. అద్వానీలు సైతం ఒక వయసు తర్వాత ఇంటికే పరిమితమయ్యారు. అంతేందుకు... తాజాగా మన పక్కనే ఉన్న కర్ణాటకలో కూడా పార్టీ కోసం ఎంతో కష్టపడిన బీఎస్ యడియూరప్పను కూడా వయసు కారణంగా తప్పించి... అక్కడ బసవరాజ్ బొమ్మైని సీఎం కూర్చిలో కూర్చొచెట్టింది కమలం పార్టీ. ఇప్పుడు మోదీ వయసు కూడా 71 వయసు దాటేసింది. ఈ నేపథ్యంలో వచ్చే ఎన్నికల్లో మోదీ పోటీ చేస్తారా... లేదా.... పోటీ చేయకపోతే... ప్రధాని అభ్యర్థి ఎవరూ అనేది ప్రస్తుతానికి మిలియన్ డాలర్ల ప్రశ్న.


మరింత సమాచారం తెలుసుకోండి: