ప్రధానమంతి నరేంద్ర మోదీ.... ప్రస్తుతం దేశంలోనే కాదు... ప్రపంచంలోనే అత్యంత ప్రభావవంతమైన వ్యక్తుల జాబితాలో ముందు వరుసలో ఉన్న వ్యక్తి. భారతీయ జనతా పార్టీని రెండు సార్లు వరుసగా అధికారంలోకి తీసుకువచ్చిన నేత. తమ మాటల గారడీతో ప్రజలను మాయ చేయగల సత్తా ఉన్న నేత. అటు ప్రజలను కానీ... ఇటు ప్రతిపక్షాలను కానీ... తన ప్రసంగంతో కట్టిపడేయగల సత్తా ఉన్న నేత. అంతటి ప్రతిభావంతునికి ప్రస్తుతం ఒకటే భయం... అదే సొంత రాష్ట్రం గుజరాత్, ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు. ఇంకా చెప్పాలంటే ప్రస్తుతం మోదీకి గుజరాత్ బెంగ ఎక్కువగానే ఉంది. బీజేపీని వరుసగా ఆరుసార్లు అధికారంలో కూర్చొబెట్టిన గుజరాతీ ఓటర్లు మరోసారి తమకు అదే అవకాశం ఇస్తారా అనే అనుమానం ఉంది. అసలు తనకు ప్రధాని రావడానికి కారణమైన గుజరాత్‌లో పార్టీ మరోసారి అధికారంలోకి వస్తుందా అనేది ప్రస్తుతం మోదీ మదిని తొలిచేస్తున్న ప్రశ్న.

గుజరాత్ ఎన్నికల్లో వరుస విజయాలతో విజయ దుందుభి మోగించిన బీజేపీకి ప్రస్తుతం కొంత గడ్డుకాలంగానే కనిపిస్తోంది. ఇంకా చెప్పాలంటే అసలు ఈ దఫా గెలుస్తుందో లేదో కూడా అనుమానమే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. అధికారంలోకి వచ్చిన తర్వాత... సొంత రాష్ట్రం గుజరాత్‌కు ఎన్నో ప్రత్యేకతలు వచ్చేలా ప్లాన్ చేశారు ప్రధాని మోదీ. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన సర్దేర్ వల్లభాయ్ పటేల్ విగ్రహం ఏర్పాటు చేశారు. అహ్మదాబాద్‌లో అతి పెద్ద క్రికెట్ స్టేడియం నిర్మించి.. దాని ప్రారంభోత్సవానికి ఏకంగా అమెరికా అధ్యక్షుడిని పిలిపించాడు. అలాగే 780 కోట్ల రూపాయలతో మెగా స్పోర్ట్స్ కాంప్లెక్స్ నిర్మిస్తున్నారు. వీటితో పాటు ఎన్నో ప్రత్యేకతలు ఉండేలా ప్లాన్ చేశారు మోదీ. అయినా సరే... వచ్చే ఏడాది జనవరిలో జరిగే ఎన్నికల్లో గెలుపు కష్టమే అంటున్నారు విశ్లేషకులు. 2017లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో చావు తప్పు కన్ను లొట్ట పోయినట్లుగా ఏదో అత్తెసరు మెజారిటీతో బీజేపీ విజయం సాధించింది. కేవలం 99 సీట్లు మాత్రమే గెలిచి... పదవిలోకి వచ్చింది కాషాయ పార్టీ. ఇప్పటికే పార్టీలో సీనియర్ నేతలపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉంది. అలాగే పటేల్ రిజర్వేషన్ అమలు కూడా పెండింగ్‌లోనే ఉంది. పైగా సరిగ్గా ఎన్నికలకు ఆరు నెలల ముందే సీఎం పదవి నుంచి విజయ్ రూపానీని తప్పించారు. ఈ పరిస్థితుల్లో పార్టీ విజయం సాధిస్తుందా లేదా అనేది ప్రస్తుతం ప్రధాని మోదీకి పెద్ద సమస్యగా మారింది.


మరింత సమాచారం తెలుసుకోండి: