తిరువనంతపురంలోని శ్రీ పద్మనాభస్వామి ఆలయం అనగానే అందరికీ టక్కున గుర్తుకు వచ్చేది నేలమాలిగలోని అపార సంపద ఉందన్న విషయం. నిజానికి కొన్నేళ్ల క్రితం వరకు ఈ దేవాలయంలోని అనంత పద్మనాభస్వామికి అంతులేని సంపద ఉండేది. అయితే ఇప్పుడా పద్మనాభుడు ఆర్థిక సంక్షోభంలో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని స్వయంగా ఆ ఆలయ పరిపాలనా కమిటినే సుప్రీంకోర్టు దృష్టికి తీసుకువెళ్లింది. ఆలయానికి తగినంత ఆదాయం రాకపోవడం వల్ల.. శ్రీపద్మనాభస్వామి పూజలు, కైంకర్యాలు, ఆలయ నిర్వహణ, భక్తులకు సౌకర్యాలు వంటి వాటికి అవసరమైన నెలవారీ ఖర్చులకు చాలా ఇబ్బందిగా ఉందని తెలిపింది. ప్రతి నెలా ఆలయ నిర్వహణ, స్వామివారి ధూపదీప నైవేద్యాలు, కైంకర్యాలు, సేవలు వంటి వాటి ఖర్చులకు రూ.1.25 కోట్లు అవసరముంటుందని తెలిపింది. కానీ ఆలయానికి 60 నుండి 70 లక్షల రూపాయల వరకు మాత్రమే ఆదాయం వస్తున్నట్లు పద్మనాభస్వామి ఆలయ పరిపాలన కమిటీ సుప్రీంకోర్టుకి వెల్లడించింది. ట్రావెన్‌కోర్‌ రాజకుటుంబీకులు నిర్వహిస్తున్న ట్రస్టు నుంచి శ్రీ అనంత పద్మనాభస్వామి ఆలయానికి నిధులు అందేలా చూడాలని కోరింది. అలాగే రాజకుటుంబీకుల ఆధీనంలో ఉన్న శ్రీ పద్మనాభస్వామి దేవాలయ ట్రస్ట్‌ వ్యవహారాలపైనా ఆడిట్‌ జరిపించాలని కోరుతూ పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్‌పై విచారణ సందర్భంగా ఆలయం ఆర్థిక సంక్షోభంలో ఉన్నట్లు పరిపాలన కమిటీ తరపు న్యాయవాది సుప్రీంకోర్టు దృష్టికి తీసుకెళ్లారు.

2013 సంవత్సరం నాటి ఆడిట్‌ ప్రకారం చూస్తే.. ట్రస్టు దగ్గర  రూ. 2.87  కోట్లు నగదు, రూ. 1.95 కోట్లు విలువజేసే ఆస్తులున్నట్టు ఆలయ పరిపాలన కమిటీ న్యాయవాది తెలిపారు. ఆలయ ఆస్తులన్నీ ఎంత వరకు ఉన్నాయనేది తెలుసుకోవడానికే ఆడిట్‌ జరగాల్సిన అవసరముందని వాదించారు. కాగా, ఈ వాదనలను ట్రావెన్‌కోర్‌ రాజకుటుంబీకులు నిర్వహిస్తున్న ట్రస్ట్ తరఫు లాయర్‌ తోసిపుచ్చారు. ఆలయ పరిపాలన తోపాటు రోజువారీ వ్యవహారాలతో ట్రస్ట్‌కు సంబంధం లేదనీ, అందులో ట్రస్ట్‌ పాత్ర కూడా లేదని అన్నారు. రాజకుటుంబీకులు తమకు సంబంధం కలిగిన పూజలను మాత్రమే పర్యవేక్షిస్తారని చెప్పారు. ట్రస్ట్‌కు ఆలయంతో సంబంధం లేదని వాదించారు. అలాగే ఆడిట్‌ చేయించాల్సిన పనిలేదని కూడా చెప్పారు. అసలు ట్రావెన్‌కోర్ ట్రస్ట్‌ వ్యవహారాల్లో ఆలయ కమిటీ జోక్యానికి, పర్యవేక్షణకు అంగీకరించేది లేదని తేల్చిచెప్పారు. ఐటీ చట్టం నిబంధనల ప్రకారం కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. దేవాలయ ఆదాయ, వ్యయాలపై పాతిక ఏళ్ల ఆడిట్‌ను నిర్వహించాలని గతేడాది జారీచేసిన ఉత్తర్వులనుంచి ట్రస్ట్‌ను మినహాయించాలని కోరారు.

మరింత సమాచారం తెలుసుకోండి: