పెట్రో ధరలు మండిపోతున్నాయి. ఒకప్పుడు కొంపదీసి పెట్రోల్‌ ధర 100 అవుతుందా ఏంటి అని భయపడిన జనాలు.. ఇప్పుడు ఆ ధర కొంపదీసి 150 రూపాయలు అవుతుందా ఏంటి అని భయపడాల్సిన పరిస్థితి.. గతంలో ఎప్పుడో మూడు నెలలకో.. ఆరు నెలలకో రూపాయో, రెండు రూపాయలో పెరిగే పెట్రోల్, డీజిల్ ధరలు ఇప్పుడు ఏకంగా రోజూ పెరుగుతూ చకచకా సెంచరీలు కొట్టేస్తున్నాయి. పెరుగుతున్న పెట్రో ధరలతో సామాన్యుడి బతుకు బండి కనాకష్టంగా తయారవుతుంది.


దారుణం ఏంటంటే.. సామాన్యుడి నిత్యం జీవితంలో భాగమైన పెట్రోలు ధర.. విమానం ఇంధనం ధరను ఏనాడో దాటేసింది. పెట్రోల్, డీజిల్‌ ధరలు ఏరోజుకు ఆ రోజు పెరిగిపోతుంటే.. విమాన ఇంధన ధర మాత్రం అలాగే ఉంది. దీంతో ఇప్పుడు పెట్రోల్, డీజిల్‌ కంటే విమాన ఇంధనం చాలా చవకగా మారిపోయింది. నమ్మడానికి విచిత్రంగా ఉన్నా ఇది నిజం. ప్రస్తుత మోదీ రాజ్యంలో ఇలాంటి విచిత్రాలే జరుగుతున్నాయి. విమాన రాకపోకలకు  వాడే ఎయిర్‌ టర్బైన్‌ ఫ్యూయల్‌.. దీన్నే సింపుల్‌గా ఏటీఎఫ్‌ అంటారు. దీని లీటరు ధర కంటే లీటరు  పెట్రోలు ధర రూ.20  వరకూ ఎక్కువగా ఉంది.


ఈ ఏటీఎఫ్‌ ధర మన పెట్రోల్, డీజిల్ ధరల్లా లీటర్లలో ఉండదు.. కిలో లీటర్లలో ఉంటుంది. అంటే వెయ్యి కిలోలీటర్ల ధర అన్నమాట. ప్రస్తుతం ఏటీఎఫ్‌ కిలో లీటరు ధర రూ.83,000 గా ఉంది. అంటే.. ఒక్క లీటరు ధర 83 రూపాయలన్నమాట. అంటే ధనికుడు వాడే విమానం ఇంధనం ధర లీటర్‌ 83రూపాయలు ఉంటే.. సామాన్యుడు వాడే పెట్రోల్ ధర 110 రూపాయలు ఉందన్నమాట. ఇంకా క్లారిటీగా చెప్పాలంటే..  పెట్రోలు, డీజిల్‌ ధరలు విమాన ఇంధన ధరలతో పోలిస్తే 33 శాతం వరకూ ఎక్కువ.


అయితే.. రేట్లు పెరిగినా ప్రజలకు పెట్రోల్ వాడకుండా ఎక్కడకు పోతారని మోడీ సర్కారు ధీమాగా ఉంది. వినియోగం లెక్కలు కూడా అదే చెబుతున్నాయి మరి.  కొవిడ్‌ రాక ముందు కంటే ఇప్పుడు పెట్రోల్ వాడకం మరింత పెరిగిందని సర్కారు లెక్కలు చెబుతున్నాయి. ఇదీ మన ఘనమైన మోదీ సర్కారు మోదుడు.. బాదుడు.

మరింత సమాచారం తెలుసుకోండి: