రిజర్వేషన్లు.. మన దేశంలో ఇదెప్పుడూ ఓ వివాదాస్పద అంశమే. వెనుకబడిన తరగతులను ఆదుకోవాలన్నది రాజ్యంగ స్ఫూర్తి అని.. రాజ్యాంగమే రిజర్వేషన్లు ప్రసాదించిందని రిజర్వేషన్లు కోరుకునేవారు చెబుతారు. అయితే అంబేద్కర్ ఇన్నాళ్ల పాటు రిజర్వేషన్లు అమలు చేయాలని చెప్పలేదని.. కేవలం పదేళ్లు అని మాత్రమే చెప్పారని.. కానీ నేతలు మాత్రం వాటిని పొడిగిస్తున్నారని రిజర్వేషన్లు వద్దనే వారు చెబుతుంటారు. ఇందులో ఎవరి వాదనలు వారికి ఉంటాయి.


వాస్తవాలు ఎలా ఉన్నా.. రిజర్వేషన్లు ఏళ్ల తరబడి అమలు చేసినా పరిస్థితిలో రావాల్సినంత  మార్పు రాలేదన్నది మాత్రం వాస్తవం. అదే కారణంగా చూపిస్తూ కేసీఆర్ సర్కారు చట్టాల్లో లేని అంశాల్లోనూ ఇటీవల రిజర్వేషన్లు కల్పిస్తోంది. తాజాగా తెలంగాణ సర్కారు  మద్యం దుకాణాల కేటాయింపుల్లో రిజర్వేషన్లు కల్పించింది. ఇటీవలి కాలంలో మద్యం దుకాణాలు బంగారు బాతులుగా మారిన సంగతి తెలిసిందే. అయితే వీటి కేటాయింపు కేవలం లాటరీ ఆధారంగా జరుగుతుంది. అందుకే ఈ మద్యం దుకాణాల కేటాయింపులో  ప్రభుత్వం ఎస్సీలకు 10శాతం, ఎస్టీలకు 5శాతం రిజర్వేషన్‌ కల్పించింది. గౌడ్‌లకు 10 శాతం రిజర్వేషన్లు కల్పించింది.


అయితే.. ఈ రిజర్వేషన్ల కేటాయింపుపై తెలంగాణ రిపబ్లికన్‌ పార్టీ దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేసింది. ఈ రిజర్వేషన్లు జనాభా ప్రాతిపదికన లేవని అభ్యంతరం చెప్పింది. 2011 జనాభా లెక్కల ప్రకారం ఎస్సీలు 15.45 శాతం, ఎస్టీలు 9.08 శాతం ఉన్నారని తెలంగాణ రిపబ్లికన్ పార్టీ వాదిస్తోంది. దీన్ని బట్టి ఎస్సీలకు ఇంకా రిజర్వేషన్ పెంచాలని వాదించారు. జనాభా ప్రాతిపదికను పరిగణనలోకి  తీసుకోకుండా రిజర్వేషన్లు ఖరారు చేయడం రాజ్యాంగ విరుద్ధం అని వాదించారు.


అయితే పిటిషనర్ వాదనను హైకోర్టు తోసిపుచ్చింది..  రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్‌కు ఇది విరుద్ధమో చెప్పాలని ప్రశ్నించింది. మద్యం దుకాణాల కేటాయింపులో రిజర్వేషన్లు ఇవ్వాలని చట్టంలో లేదని.. అందుకే  జోక్యం చేసుకోలేమని చెప్పింది. ఇవి ప్రభుత్వం దయతో ఇస్తోందని.. వీటిలో కలుగజేసుకోలేమని చెప్పింది. పిటిషనర్ మరిన్ని వివరాలు సమర్పించేందుకు సమయం కోరగా విచారణ డిసెంబరు 20కి వాయిదా పడింది.

మరింత సమాచారం తెలుసుకోండి: