విజయవాడ టీడీపీ ఎంపీ కేశినేని నాని మరోసారి జిల్లా లో పార్టీలో తన ఆధిపత్యాన్ని చాటుకున్నారు. 2019 సాధార‌ణ ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ లో టీడీపీ చిత్తుచిత్తుగా ఓడిపోయింది. అయితే విజయవాడ ఎంపీ గా నాని రెండోసారి విజయం సాధించారు. నానికి విజయవాడలో వ్యక్తిగత ఇమేజ్ ఉండటంతోనే పార్టీ చిత్తుగా ఓడిపోయినా ... విజయవాడ పార్లమెంటు పరిధిలో ఏకంగా పార్టీ నుంచి పోటీ చేసిన‌ ఆరుగురు ఎమ్మెల్యే అభ్యర్థులు ఓడిపోయినా .. నాని మాత్రం ఎంపీగా రెండోసారి గెలిచారు.

ఆ తర్వాత నాని పార్టీలో తనకు ప్రాధాన్యత లేదని అస‌మ్మ‌తి గ‌ళం వినిపిస్తూ వచ్చారు. ఒకానొక టైంలో పార్టీ అధినేత‌ చంద్రబాబు , లోకేష్ ల‌ను టార్గెట్ చేసుకుని ప‌రోక్షంగా సెటైర్లు వేశారు. బెజవాడ నగర టీడీపీ నేతలు  అయిన మాజీ ఎమ్మెల్యే బోండా ఉమ - మాజీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న తో పాటు షేక్ నాగుల్ మీరా లతో రాజకీయంగా కయ్యానికి కాలు దువ్వారు. ఇక బెజవాడ కార్పొరేషన్ ఎన్నికల్లో ఈ గ్రూపు గొడ‌వ‌లే పార్టీ కొంప కొల్లేరు చేసేశాయి.

అయితే ఇప్పుడు నాని తాను లేకుంటే జిల్లాలో టీడీపీ లేదన్న సంకేతాలు పంపినట్టు తెలుస్తోంది. కృష్ణా జిల్లా తెలుగుదేశం పార్టీలో కేశినేని నాని ఇప్పుడు కీలక నేతగా ఎదిగారు. మరోవైపు పార్టీ అధినేత చంద్రబాబు సైతం నానికి అమితమైన ప్రాధాన్యం ఇస్తున్నారు.  చంద్రబాబు 36 గంటల దీక్ష శిబిరానికి హాజరయిన కేశినేని నానితో చంద్ర‌బాబు చాలా సేపు ఏకాంతంగా మాట్లాడారు.  బాబు దీక్ష తర్వాత కేశినేని నాని తిరిగి పార్టీలో యాక్టివ్ అయ్యారని గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి.

ఆ త‌ర్వాత ఆయ‌న జిల్లా లో బాగా ప‌ర్య‌టిస్తూ ప్ర‌జ‌ల ప‌క్షం నిలుస్తున్నారు. తాజాగా కొండపల్లి మున్సిపల్ ఎన్నికలను కూడా కేశినేని నాని ప్రతిష్టాత్మకంగా తీసుకుని స‌త్తా చాటారు. మాజీ మంత్రి దేవినేని ఉమను వ్యతిరేకించినా, ఆయన నియోజకవర్గ పరిధిలోనే ఎన్నిక జరుగుతున్నా తాను ఎక్స్ అఫీషియో స‌భ్యుడిగా ఓటు వేసి కొండ‌ప‌ల్లి మున్సిపాల్టీ పై పార్టీ జెండా ఎర‌గ‌డంలో కీల‌క పాత్ర పోషించారు. దీంతో నాని ఇమేజ్ అమాంతంగా పెరిగింది. దీంతో జిల్లా పార్టీలో కీల‌క బాధ్య‌త‌ల‌ను నాని చేతుల్లోనే బాబు పెట్ట‌బోతున్నార‌ని అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: