పీఆర్సీ ప్రకటించకపోవడం, సీపీఎస్ రద్దు చేయకపోవడం వంటి విషయాల్లో అసలే ఏపీ ఉద్యోగులు ప్రభుత్వంపై గుర్రుగా ఉన్నారు. ఇప్పటికే ఉద్యమ కార్యాచరణ ప్రకటించగా ప్రభుత్వం తాజాగా చర్చలకు పిలిచింది. దీంతో ఉద్యోగులు చర్చలకు రెడీ అవుతున్నారు. ఈ దశలో మంత్రి సీదిరి అప్పల రాజు వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది. వీఆర్వోలపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ మంత్రిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు రెవెన్యూ సిబ్బంది. ఇప్పటికే నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలియజేశారు. ఇకపై సచివాలయాలకు రాబోమంటూ తేల్చి చెబుతున్నారు.

శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గలో జరిగిన ఓ అధికారిక కార్యక్రమంలో వీఆర్వోలపై మంత్రి అనుచిత వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలున్నాయి. వీఆర్వోలు సచివాలయాలకు వస్తే తరిమేయాలంటూ మంత్రి అన్నారని చెబుతున్నారు. రెవెన్యూలో వీఆర్వోల విధులు కీలకం అని 24గంటలు ఎప్పుడూ ప్రజలకు అందుబాటులో ఉంటారని, విపత్తు సమయాల్లో పోలీసు విధుల్లాగే, వీఆర్వోలు కూడా క్షేత్ర స్థాయిలో అందుబాటులో ఉండి విధులు నిర్వహిస్తారని, అలాంటి విలేజ్ రెవెన్యూ ఆఫీసర్లపై మంత్రి చేసిన వ్యాఖ్యలు సరికాదంటున్నారు రెవెన్యూ సంఘాల నేతలు. వీఆర్వోలకు వెంటనే మంత్రి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.

మంత్రి వ్యాఖ్యల వ్యవహారం సీఎం జగన్ వద్దకు చేరినట్టు తెలుస్తోంది. ముఖ్యమంత్రి జగన్ వరద బాధితుల పరామర్శ యాత్రలో బిజీగా ఉన్నా.. కొంతమంది ఈ వ్యవహారాన్ని ఆయన వద్దకు తీసుకెళ్లారని తెలుస్తోంది. అందులోనూ వీఆర్వోలంతా నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలియజేస్తుండే సరికి ఈ విషయం మరింత ప్రాముఖ్యత సంతరించుకుంది. సచివాలయాలకు వెళ్లకుండా తహశీల్దార్ ఆఫీసుల్లోనే వీఆర్వోలు విధులు నిర్వహించాలంటూ కొన్ని సంఘాలు పిలుపునిచ్చాయి. ఇప్పటి వరకూ మంత్రి అప్పలరాజు ఈ వ్యవహారంపై స్పందించలేదు. అయితే ఈ వివాదానికి ఫుల్ స్టాప్ పెట్టేలా ఆయన స్పందించాలని వీఆర్వోలు డిమాండ్ చేస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా వీఆర్వోల ఆందోళనలు, నిరసనలు కొనసాగుతున్న వేళ మంత్రి ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు. ముఖ్యమంత్రి ఆయనకు ఎలాంటి సూచన ఇస్తారనేది తేలాల్సి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: