సింగరేణిలో సమ్మె సైరన్ మోగనున్న‌ది.  ప్ర‌యివేటు వ్యక్తులకు బొగ్గు గనులు అప్పగించవద్దని.. ఇప్ప‌టికే ఐదు జాతీయ సంఘాలు సమ్మెకు పిలుపునిచ్చాయి. డిసెంబ‌ర్‌ 9, 10, 11 తేదీల‌లో సమ్మె చేసేందుకు కార్మిక సంఘాలు నోటీసులు ఇచ్చాయి. ఇప్పటికే సింగరేణి యాజమాన్యం కార్మిక సంఘాలతో చర్చలు జరిపినప్పటికీ ప్రయోజనం లేకుండా పోయింది. దీంతో సమ్మె అనివార్యం అని కార్మిక సంఘాలు స్పష్టం చేస్తున్నాయి.

ఖమ్మం జిల్లా సత్తుపల్లి, మంచిర్యాల జిల్లా కళ్యాణిఖని, శ్రావణపల్లి, కొత్తగూడెం జిల్లా కోయగూడెం బొగ్గు బ్లాకులను ప్ర‌యివేటుకు అప్పగించటాన్ని కార్మిక సంఘాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం తోపాటు ఏఐటీయూసీ, ఐఎన్టీయూసీ, హెచ్ఎమ్ఎస్, సీఐటీయూ, బీఎమ్ఎస్ సమ్మెకు పిలుపునిచ్చాయి. ఈనెల 9, 10, 11 తేదీల‌లో నిరసన తెలపాలి అని సింగరేణి సంస్థకు నోటీసులిచ్చాయి. ఆయా సంఘాలతో చర్చలు జరిపిన సింగరేణి యాజమాన్యం సంస్థ తరఫున కేంద్రానికి లేఖ రాయడంతో.. ఆ బ్లాక్‌లలో చేపట్టిన అన్వేషణ పనులను వివరించామని కార్మిక సంఘాలకు యాజమాన్యం తెలిపిన‌ది. బొగ్గు బ్లాక్‌లను సింగరేణికి కేటాయించాలని కోరుతూ సీఎం కూడా కేంద్రానికి లేఖ రాసిన విషయాన్ని సంఘాలకు వివరించిన‌ది. బొగ్గు బ్లాక్‌ల కేటాయింపు ఒక్క సింగరేణి, తెలంగాణకు సంబంధించిన అంశం కాదు అని వివరించింది.

నాలుగు బొగ్గు బ్లాకులను వేలం వేయాలని మంత్రిత్వశాఖ ప్రతిపాదనలు చేయడం.. అవి టెండర్‌ స్థాయికి రావడం కార్మికుల్లో ఆందోళన కలిగిస్తున్న‌ది. ఈ నాలుగు బ్లాకులతోపాటు.. మిగిలిన బ్లాకులన్నీ ప్ర‌యివేటు పరమయ్యే అవకాశం ఉన్న‌ద‌ని  కార్మికుల్లో ఆందోళన నెలకొంది. బొగ్గు బ్లాకుల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కార్మిక సంఘాలు చేస్తున్న మూడు రోజుల‌ సమ్మె మాత్రమే సరిపోదు అని టీబీజీకేఎస్ భావిస్తున్న‌ది. ప్ర‌యివేటీక‌ర‌ణ ప్రభావ తీవ్రతను సీఎం దృష్టికి తీసుకెళ్లి.. ఈ బ్లాక్‌లను సింగరేణికే అప్పగించే విధంగా యత్నించాలని యోచిస్తున్న‌ది. సమ్మెకు వెళ్తూనే కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాల‌ని టీబీజీకేఎస్ భావిస్తోంది.

సింగరేణిలో బొగ్గు ఉత్పత్తిపై ఇప్పటికే కొవిడ్ ప్రభావం చూపించగా.. సమ్మెతో ఆ ప్రభావం మరింత పెరిగే అవకాశము ఉన్న‌దని యాజమాన్యం భావిస్తోంది. మరోవైపు సమ్మెతో ప్రయోజనం లేకపోయినా.. బొగ్గు బ్లాకుల కోసం ఇక్కడికి వచ్చే ప్రైవేటు సంస్థలను అడ్డుకుంటామని కార్మికులు  పేర్కొంటున్నారు. అవసరమైతే ఢిల్లీకి వెళ్లి ఆందోళన చేస్తామని.. బొగ్గు బ్లాకులను ప్ర‌యివేటుకు అప్పగించడం మూలంగా  మా కార్మికుల మనుగడ ప్రశ్నార్థకంగా మారనున్న‌దని.. అందుకే సమ్మెకు వెళుతూ కేంద్రంపై ఒత్తిడి తేవాలని అనుకుంటున్నాం అని స్ప‌ష్టం చేస్తున్నారు టీబీజీకేఎస్ నేత‌లు.  సమ్మె చేయడం ద్వారా ప్రభుత్వానికి మా నిరసన తెలిపే ప్రయత్నం చేస్తున్నాం అని,  సమ్మె వల్ల కేంద్ర ప్రభుత్వం వెనక్కు తగ్గుతుందని మేము భావిస్తున్నాం అని   టీబీజీకేఎస్‌ ప్రధాన కార్యదర్శి మిర్యాల రాజిరెడ్డి పేర్కొన్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: