రాష్ట్ర రాజకీయాల్లో కొత్త పార్టీ రానుందన్న సంకేతాలు స్పష్టం అవుతున్నాయి.రాజశేఖర్ రెడ్డి వారసురాలు షర్మిల సొంతగా ఓ పార్టీ పెట్టేందుకు ఎప్పటి నుంచో చేస్తున్న సన్నాహాలు ఓ కొలిక్కి వచ్చేలానే కనిపిస్తున్నాయి.వాస్తవానికి ఎప్పటి నుంచో అన్నతో ఉన్న విభేదాల దృష్ట్యా ఆమె వేరు కుంపటి రాజేస్తారన్న వార్తలు వచ్చినా కూడా అవన్నీ పెద్దగా మీడియాలోకి రాకుండా జాగ్రత్త పడ్డారు వైసీపీ సభ్యులు.అయితే ఈ రోజు షర్మిల కొత్త పార్టీ ఏర్పాటుపై ఓ క్లారిటీ ఇవ్వడంతో ఓ సానుకూల సంకేతం మీడియా ఎదుట వెల్లడి చేయడంతో రెడ్డి సామాజికవర్గం ప్రతినిధులు, వైఎస్సార్ అభిమానులు అంతర్మథనం చెందుతున్నారు. ఇప్పటికే ఓ ఇంటర్వ్యూలో ఆ రోజు తన సాయం పొందిన అన్న తరువాత పక్కకుపెట్టిన వైనంపై బాధపడ్డారు కూడా! ఆ బాధకు మరో రూపమే పార్టీ అని తేలిపోయింది ఈ వేళ.
ఇక ఫోకస్ పాయింట్ కు వస్తే రాష్ట్ర రాజకీయాల్లో మహిళలు లీడ్ రోల్ లో ఉంటూ రాజకీయ పార్టీలు పెట్టిన ఘనత లక్ష్మీపార్వతి తోనే మొదలయింది. ఆమె ఎన్టీఆర్ టీడీపీ (ఎల్పీ) పేరిట పార్టీ పెట్టి 90ల కాలంలో పాతపట్నం నియోజకవర్గం నుంచి గెలుపొంది అసెంబ్లీలో అడుగిడారు. అప్పటి స్పీకర్ యనమల రామకృష్ణుడు. నాటి పరిణామాల్లో భాగంగా చెన్నారెడ్డి పై ప్రవేశ పెట్టిన సంతాప తీర్మానంలో భాగంగా ఆమె మాట్లాడి, తన బాధను వెల్లడించారు. కొన్ని సంస్కృత శ్లోకాలను వల్లెవేశారు కూడా! ఆశ్చర్యం ఏంటంటే ఎన్టీఆర్ టీడీపీ (ఎల్పీ) తరువాత పరిణామాల్లో లేకుండా పోయింది. ఎన్టీఆర్ జీవిత కాలం శత్రువుగా భావించిన కాంగ్రెస్ గూటికి ఆమె చేరిపోయారు. తరువాత ఆమె స్తబ్దంగా ఉండిపోయారు. ఇప్పుడిప్పుడే మళ్లీ వైసీపీలో యాక్టివ్ అయి, తెలుగు అకాడమీ చైర్మన్ గా ఉంటూ రాజకీయం నడుపుతున్నారు. ఇక్కడ కూడా వివాదలమయం గానే ఉంది ఆమె నడవడి.
రాష్ట్ర రాజకీయాల్లో ఎల్పీ తరువాత సొంతంగా పార్టీ పెట్టిన మరో వివాదాస్పద మహిళా నేత అరకు మాజీ ఎంపీ కొత్త పల్లి గీత.జన జాగృతి పేరిట ఈమె పార్టీ ఆరంభించి మైక్ గుర్తుపై 2019 ఎన్నికల్లో పోటీచేశారు. తరువాత ఆమె స్తబ్దుగా ఉన్నారు. ప్రస్తుతం ఆమె క్రియాశీలకంగా లేరనే తెలుస్తోంది. గతంలో ఆమె డిప్యూటీ కలెక్టర్ గా పనిచేశారు. కొంత కాలం ఆమెతో గిడ్డి ఈశ్వరి అనే టీడీపీ లీడర్ విభేదించి తరుచూ తగాదాలు పెట్టుకున్న ఘటనలూ ఉన్నాయి. ఇప్పుడు షర్మిల వీరి కోవలోనే ఉంటారా లేదా
సమర్థ రీతిలో పార్టీని నడుపుతారా అన్నదే అతి పెద్ద ప్రశ్న. ఇప్పటికే షర్మిల ఓ ఇంటర్వ్యూలో సజ్జల రామకృష్ణా రెడ్డి (ఏపీ ప్రభుత్వ ప్రధాన సలహాదారుల్లో ఒకరు) ని టార్గెట్ చేశారు.అదేవిధంగా రేపటి వేళ ఇంకొందరిని కూడా టార్గెట్ చేయనున్నారు. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే వైఎస్సార్టీపీని ప్రారంభించేటప్పుడు కూడా ఇదే ఆవేశంతో ఆమె ఉన్నారు. తరువాత మాత్రం అక్కడ పరిణామాలు కలిసిరాక, ఆర్థికంగా నిలదొక్కుకోలేక ఇటుగా వస్తున్నారు. గతంలో ఆమె చెప్పిన విధంగానే ఈ పార్టీకి కూడా ప్రధాన ఎన్నికల వ్యూహకర్తగా ప్రశాంత్ కిశోర్ ఉంటారా?
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి