కోలీవుడ్ సూప‌ర్ స్టార్‌గా ద‌శాబ్దాలుగా వెలుగొందుతున్న ర‌జ‌నీకాంత్ నేతృత్వంలో త‌మిళ‌నాట కొత్త రాజ‌కీయ పార్టీ రావ‌డం ఖాయ‌మేన‌ని గ‌త ఎన్నిక‌ల ముందు అంద‌రూ భావించిన విష‌యం తెలిసిందే. చివ‌ర‌కు త‌న‌కు ఆ ఉద్దేశం లేద‌ని చెప్పడంతో ఆయ‌న అభిమానులు తీవ్రంగా నిరాశ చెందారు. అయితే ర‌జ‌నీ నిర్ణ‌యానికి తెర‌వెనుక ముందు జ‌రిగిన చాలా ప‌రిణామాలే కార‌ణ‌మ‌ని ఆయ‌న స‌న్నిహిత వ‌ర్గాలు చెపుతాయి. వీటిలో ఆయ‌న ప్ర‌త్య‌ర్థులు ఆయ‌న నాన్ లోక‌ల్ అన్న అంశాన్ని తిరిగి తెర‌పైకి తేవ‌డం కూడా ఒక‌టి. నిజానికి త‌లైవా రాజ‌కీయాల్లోకి రావాల‌న్న ఆయ‌న అభిమానులు కోరిక చాలాకాలం నాటిది. దాదాపు రెండు ద‌శాబ్దాలకు పూర్వ‌మే జ‌య‌ల‌లిత ముఖ్య‌మంత్రిగా ఉండ‌గా వారిద్ద‌రి మ‌ధ్య ఏవో కార‌ణాల‌తో గొడ‌వ‌లు వ‌చ్చాయ‌ని, ఆ కార‌ణంగా ర‌జ‌నీకాంత్ రాజ‌కీయాల్లోకి వ‌చ్చే అవ‌కాశ‌ముంద‌ని తొలిసారిగా వార్త‌లు వ‌చ్చాయి. అయితే అవి వాస్త‌వ రూపం దాల్చ‌లేదు. అయితే ఆ త‌రువాత జ‌రిగిన ఎన్నిక‌ల్లో జ‌య‌ల‌లిత ఓడిపోవ‌డానికి అంత‌కు ముందు ఆమె ర‌జ‌నీకాంత్ విష‌య‌లో దురుసుగా, అహంకారంగా వ్య‌వ‌హ‌రించ‌డ‌మే కార‌ణ‌మ‌న్న అభిప్రాయాలు కూడా త‌మిళ రాజ‌కీయ వ‌ర్గాల్లో అప్ప‌ట్లో వినిపించాయి. దీనినిబట్టి చూస్తే ర‌జ‌నీ అంటే త‌మిళ‌ ప్ర‌జల్లో ఉన్న అభిమానాన్ని అర్థం చేసుకోవ‌చ్చు. నాటినుంచి  ప్ర‌తి ఎన్నిక‌ల్లోనూ ఆయ‌న మ‌ద్ద‌తు కోసం రాజ‌కీయ ప‌క్షాలు ముఖ్యంగా డీఎంకే, కాంగ్రెస్‌ ప్ర‌య‌త్నించేవి. ర‌జ‌నీకాంత్ మాత్రం ప్ర‌త్య‌క్షంగా ఎవ‌రికీ అండ‌గా నిలిచిన దాఖ‌లాలు లేవు. పూర్తిగా సినిమాల మీద‌నే దృష్టి పెట్టారు.
 
ఆ త‌రువాత కాలంలో జ‌య‌ల‌లిత ముఖ్య‌మంత్రిగా ఉంటూ ఆక‌స్మికంగా అనారోగ్యం పాలై విషాద‌క‌రమైన రీతిలో లోకం వీడ‌టం, ఆ త‌రువాత కొద్దికాలానికే మాజీ ముఖ్యమంత్రి, డీఎంకే అధినేత క‌రుణానిధి కూడా అస్త‌మించ‌డంతో త‌మిళనాట రాజ‌కీయ శూన్యం ఏర్ప‌డింది. దానిని ర‌జ‌నీకాంత్ మాత్ర‌మే పూరించ‌గ‌ల‌రంటూ ఆయ‌న అభిమానులు మాత్ర‌మే కాక ఆ రాష్ట్రానికి చెందిన రాజ‌కీయ వ‌ర్గాలూ భావించారు. ఆ స‌మయంలోనే మ‌ళ్లీ త‌లైవా పొలిటిక‌ల్ ఎంట్రీ విష‌యం సీరియ‌స్‌గా తెర‌మీద‌కు వ‌చ్చింది.  దానికి త‌గిన‌ట్టే బీజేపీ ఆ రాష్ట్ర రాజ‌కీయాలను ప‌రోక్షంగా శాసించేందుకు ప్ర‌య‌త్నించ‌డం, ర‌జ‌నీకి తాము అండ‌గా నిలుస్తామంటూ సంకేతాలు పంప‌డం కూడా జ‌రిగింది. ఇదే స‌మ‌యంలో ఆ రాష్ట్రంలోని ప్ర‌ధాన రాజ‌కీయ ప‌క్షాలు త‌లైవా రాజ‌కీయ రంగ ప్ర‌వేశాన్ని అడ్డుకునేందుకు త‌మ వ్యూహాన్ని తెర‌పైకి తెచ్చాయి. ఇందులో భాగంగా సీనియ‌ర్ కోలీవుడ్ ద‌ర్శ‌కుడు భార‌తీరాజా స‌హా మ‌రికొందరు ర‌జ‌నీపై నాన్ లోక‌ల్ అంటూ ఘాటుగా విమ‌ర్శ‌ల‌కు దిగారు. ర‌జ‌నీ విశ్వాసఘాతుకానికి అతను నిలువెత్తు నిదర్శనమని ఘాటు వ్యాఖ్యలు చేశారు. తమిళ వ్యక్తులు కానివారు రాష్ట్రాన్ని పాలించేందుకు ఎలాంటి పరిస్థితుల్లోనూ అంగీకరించేదిలేదని కూడా అప్ప‌ట్లో వారు విమ‌ర్శ‌ల‌కు దిగారు. వీరి వ్యాఖ్య‌ల‌ను ఖండిస్తూ ఆశించిన రీతిలో త‌న‌కు ఇత‌ర సినీ న‌టుల నుంచి మ‌ద్ద‌తు రాక‌పోవ‌డం ర‌జనీని నిరాశ‌ప‌ర‌చిందంటారు. సౌమ్యుడు, సున్నిత మ‌న‌స్కుడైన ర‌జ‌నీకాంత్ త‌న‌కు రాజ‌కీయాలు ప‌డ‌వ‌ని నిర్ణ‌యించుకోవ‌డానికి ఇదీ ఓ కార‌ణ‌మే.

మరింత సమాచారం తెలుసుకోండి: