కరోనా కేసులు పెరుగుతున్న దృష్ట్యా తెలంగాణలో పాఠశాలల సెలవులను ఈనెల 30 వరకూ పొడిగించారు. ఆన్‌లైన్‌లో క్లాసులు చెప్పుకోవచ్చని సూచించారు. అయితే.. ఆంధ్రప్రదేశ్‌లో తెలంగాణ కంటే ఎక్కువగా కరోనా కేసులు వస్తున్నాయి. కానీ.. అక్కడ మాత్రం యథావిధిగా ఇవాళ్టి నుంచి క్లాసులు ప్రారంభంకాబోతున్నాయి. మరి ఈ రెండు రాష్ట్రాల తీరులో ఎవరి నిర్ణయం సబబు అన్న సందేహాలు తలెత్తుతున్నాయి.


అయితే ఓ విద్యావేత్త ఏపీలో క్లాసులు పెట్టడాన్ని సమర్థించారు. తెలంగాణలో సెలవుల పొడగింపు మంచిది కాదన్నారు. ఆయన వాదన ఏంటంటే.. ఆరు నుంచి పది లక్షల కేసులు ఉన్న అమెరికాలోనూ విద్య సంస్థలు పని చేస్తున్నాయని ఆయన ఉదాహరణ చెబుతున్నారు. రెండు నుంచి మూడు లక్షల కేసులున్న ఫ్రాన్స్, ఇంగ్లాండ్ లాంటి దేశాల్లో కూడా విద్యాసంస్థలను  మూయ లేదని గుర్తు చేస్తున్నారు.


ఆయా దేశాలకు చదువు ప్రాధాన్యత ఆ దేశాలకు బాగా  తెలిసినందువల్లే అలా చేస్తున్నారని ఆయన అభిప్రాయపడుతున్నారు. ఆన్లైన్ వల్ల పరిమిత ఉపయోగం ఉంటుందని.. ప్రారంభం నుంచి కూడా కరోనా పిల్లల పై  ప్రభావం బాగా తక్కువగా చూపుతోందని అంతర్జాతీయ స్థాయి శాస్త్రవేత్తలు చెబుతున్న విషయాలను ఆ విద్యావేత్త తన పోస్టులో ప్రస్తావించారు. మన దేశంలో  ఓమిక్రాన్ వల్ల పిలల్లు కాదు కదా కనీసం పెద్దలు కూడా ఆసుపత్రికి వెళ్లాల్సిన అవసరం కనిపించడం లేదని ఆయన అంటున్నారు.


అంతే కాదు.. ఈ ఓమిక్రాన్ నెలకో  రెండు  నెలలకో పోతుందా అనే విషయంపై స్పష్టత లేదని.. అది ఎండెమిక్ అవుతుందని.. అంటే శాశ్వతంగా ఇక్కడే ఉండిపోతుందని.. ఓమిక్రాన్ కు  భయపడి విద్యాసంస్థల్ని మూసేయాల్సి వస్తే.. వందేళ్లు లేదా అంత కంటే ఎక్కువ కాలం మూసేయాలని ఆయన వివరిస్తున్నారు. మరి అందుకు సిద్ధమేనా అని ప్రశ్నిస్తున్నారు. తల్లితండ్రుల్లో ఉన్న భయాన్ని దృష్టిలో పెట్టుకొని తెలంగాణ ప్రభుత్వం సెలవుల్ని పొడిగించి ఉండొచ్చని.. కానీ అది సరికాదని ఆ విద్యావేత్త అభిప్రాయపడ్డారు.

మరింత సమాచారం తెలుసుకోండి: