మద్యపానం మంచిదా, చెడ్డదా..? మద్యపానం వల్ల కలిగే నష్టాలేంటి, కాస్తో కూస్తో ఉపయోగాలు ఉంటాయా..? అనేదానిపై ఎవరి అభిప్రాయాలు వారివి. కానీ మద్యపానం మంచిది కాదు అనేది సాధారణ అభిప్రాయం. అందుకే బీహార్ లాంటి రాష్ట్రాలు మద్యపానంపై పూర్తి స్థాయిలో నిషేధాన్ని అమలు చేస్తున్నాయి. ఏపీలో కూడా మద్యపాన నిషేధం అన్నారు కానీ, ప్రస్తుతానికి ఆ దిశగా ప్రయత్నాలు మొదలైనట్టు లేదు.

ఇదంతా ఇప్పుడు ఎందుకంటే.. మద్యపానం గురించి బాధ్యతాయుతమైన పదవుల్లో ఉన్నవారు, రాజకీయ నాయకులు ఏది మాట్లాడినా అది సంచలనం అవుతుంది. అందుకే ఎవరు మాట్లాడినా కాస్త ముందూ వెనక ఆలోచించి మాట్లాడతారు. కానీ బీజేపీ ఎంపీ సాధ్వి ప్రగ్యాసింగ్ ఠాకూర్ మాత్రం మద్యపానం గురించి మాట్లాడి టాక్ ఆఫ్ ది నేషన్ గా మారారు.

లైట్ గా తీసుకోవచ్చు..
మద్యం ఓ మోతాదులో తీసుకుంటే ఔషధంలా పనిచేస్తుందని సంచలన వ్యాఖ్యలు చేశారు సాధ్వి ప్రగ్యాసింగ్. అపరిమితంగా మద్యం సేవిస్తే అది విషం అవుతుందని, కానీ పరిమితంగా మాత్రమే దాన్ని పుచ్చుకోవాలని చెప్పారు. ఆయుర్వేదంలో కూడా మద్యం కానీ, ఆల్కహాల్ కానీ పరిమితంగా వాడతారని కూడా ఆమె గుర్తు చేశారు. అది ఓ ఔషధంలా పనిచేస్తుందన్నారు. అదే సమయంలో మధ్యప్రదేశ్ రాష్ట్రంలో మద్యనిషేధాన్ని అమలు చేయాలని ఆమె డిమాండ్ చేశారు. పరస్పర విరుద్ధంగా ఆమె చేసిన ప్రకటనపై నెటిజన్లు కూడా రివర్స్ అటాక్ మొదలు పెట్టారు.

ప్రగ్యా వ్యాఖ్యలు వైరల్..
గతంలో అనారోగ్యం కారణంగా కోర్టు హాజరు నుంచి మినహాయింపు పొందిన ప్రగ్యాసింగ్.. ఆ తర్వాత అనేక క్రీడా కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటూ కలకలం రేపారు. తాజాగా ఆమె మద్యపానం గురించి చేసిన వ్యాఖ్యలు కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. మహిళా ఎంపీ అయిఉండి కూడా ఆమె మద్యాన్ని మితంగా తీసుకోవాలంటూ ఎలా చెబుతారని ప్రశ్నిస్తున్నారు కొందరు నెటిజన్లు. అసలు మద్యపానంపై బీజేపీ విధానం ఏంటని ప్రశ్నిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: