కేంద్ర బడ్జెట్‌పై విపక్షాలు మండిపడుతున్నాయి. ఇది రొటీన్‌గా ఎప్పుడూ ఉండేదే.. ఆహా.. ఇంత ప్రగతి శీలకమైన బడ్జెట్ ఎప్పుడూ చూడలేదని ప్రభుత్వం జబ్బలు చరుచుకుంటుంది. అబ్బే... ఇదంతా మాటల గారడీ.. అంకెల గారడీ అని విపక్షాలు పెదవి విరుస్తాయి. ఇది పరమ రొటీన్ సీన్.. ప్రతి బడ్జెట్‌ రోజూ జరిగేది ఇదే.. అయినా సరే.. ఆ రొటీన్‌ను కూడా రక్తి కట్టించాలి కదా.. కానీ.. ఆ పని కొన్ని పార్టీలు సరిగ్గా చేయడం లేదట.


ఇప్పుడు టీడీపీ నేతలు ఇదే విషయాన్ని హైలెట్ చేస్తున్నారు. ఓవైపు బడ్జెట్‌ పరమ దరిద్రంగా ఉందని కేసీఆర్ మండిపడ్డారు. కేంద్ర బడ్జెట్‌ చాలా దారుణంగా ఉందన్నారు కేసీఆర్‌.. బడ్జెట్‌ సందర్భంగా మహాభారతంలోని శ్లోకాలు ప్రస్తావించారని.. ప్రజలు కష్టాల్లో ఉన్నప్పుడు ఎలా పాలించాలో శ్లోకం చెబుతుందని.. కానీ.. ఆర్థికమంత్రి చెప్పింది శాంతి మార్గం.. చేసింది అధర్మం అని కేసీఆర్ ఎండగట్టారు. బడ్జెట్‌లో అందరికీ గుండు సున్నా.. ఈ బడ్జెట్‌ అంతా గోల్‌మాల్‌ గోవిందం అని కేసీఆర్ తేల్చి చెప్పారు. నిర్మలాసీతారామన్‌ ఆత్మవంచన చేసుకున్నారని.. దేశ ప్రజలనూ వంచించారని సీఎం కేసీఆర్ మండిపడ్డారు.


ఇప్పుడు టీడీపీ దీన్ని హైలెట్ చేస్తోంది. చూశారా.. అక్కడ కేసీఆర్ అన్ని తిట్లు తిడుతున్నారు.. మరి మీరేం చేస్తున్నారు అంటూ వైసీపీ నేతలపై మండిపడుతున్నారు. ప్రత్యేకించి జగన్‌ను టార్గెట్ చేస్తూ విమర్శలు చేస్తున్నారు. రాష్ట్రం కోసం జగన్ పోరాడి సాధించుకోవాలని.. కావాలంటే మీ మిత్రుడు కేసియార్ కేంద్రాన్ని తిట్టిన తిట్టు తిట్టకుండా తిడుతున్నారు చూడండి.. మీకు ఆయనకున్న ధైర్యం కూడా లేకపోయిందా అని టీడీపీ ఎంపీలు మండిపడుతున్నారు.


జగన్.. మీరు.. పోరాడతారా, పారిపోతారా తేల్చుకోండి.. అంటూ కవ్విస్తున్నారు టీడీపీ ఎంపీలు. బడ్జెట్ ఆశాజనకంగా లేదని.. కానీ.. బడ్జెట్ కేటాయింపుల కోసం ఏపీ ఏం చేసింది అనేది కూడా మనం చూడాలని టీడీపీ నేతలు అంటున్నారు. మొత్తానికి వైసీపీని తిట్టేందుకు టీడీపీ నేతలు కేసీఆర్ ను కూడా పొగుడుతున్నారు.. వారేవా.. ఏం సీను ఇది.

మరింత సమాచారం తెలుసుకోండి: