సికింద్రాబాద్‌ బోయగూడలో ఘోరం జరిగింది. భారీ అగ్నిప్రమాదం ఏకంగా 11 మందిని బలి తీసుకుంది. టింబర్‌, స్క్రాప్‌ గోదాంలో చెలరేగిన మంటల్లో 11 మంది చనిపోయారు. షార్ట్‌ సర్క్యూట్‌తో కారణంగా చెలరేగిన మంటలు నగరంలో విషాదం నింపాయి. మంటల్లో చిక్కుకుని 11 మంది సజీవ దహనమైన వార్త ఉదయాన్నే సికింద్రాబాద్‌ లో కలకలం రేపింది. తెల్లవారుజాము  4 గంటలకు ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది.  బోయగూడ ఐడీహెచ్‌ కాలనీలోని స్క్రాప్‌ దుకాణంలో ఈ ప్రమాదం జరిగింది.


ఈ దుకాణంలో మొత్తం 15 మంది కార్మికులు ఉంటారు. వారు అక్కడే నిద్రపోతారు. మంగళవారం రాత్రి కూడా అంతా నిదురించారు. ఆ సమయంలోనే షార్ట్ సర్క్యూట్‌ జరగి భారీగా మంటలు వచ్చాయి. ఇద్దరు కార్మికులు అగ్నికీలల నుంచి తమను తాము కాపాడుకోగా.. 13 మంది మంటల్లో చిక్కుకుపోయారు. వారిలో 11 మంది సజీవ దహనమైపోయారు. మరో ఇద్దరి గురించి ఆరా తీస్తున్నారు. విషయం తెలియగానే హుటాహుటిన ఘటనాస్థలానికి వెళ్లిన ఐదు ఫైరింజన్లు మంటలను అదుపులోకి తెచ్చేందుకు శ్రమించాయి.


గోదాంలో కట్టెలు, ప్లాస్టిక్‌ వైర్లు ఉండటం వల్ల మంటలు త్వరగా అదుపులోకి రాలేదు. విషాదం ఏంటంటే.. ఈ ప్రమాదంలో చనిపోయిన వారంతా బీహార్ నుంచి వలస వచ్చిన కూలీలే. చనిపోయిన వారి మృతదేహాలను సహాయక సిబ్బంది బయటకు తీశారు. మృతులను సికిందర్‌ (40), బిట్టు (23), సత్యేందర్‌ (35), గోలు (28) గా గుర్తించారు. వీరితో పాటు దామోదర్‌ (27), రాజేశ్‌ (25), దినేశ్‌ (35), రాజు (25) చింటు (27), దీపక్‌ (26), పంకజ్‌ (26) కూడా ఉన్నట్టు గుర్తించారు.


అగ్నిప్రమాదం విషయం తెలియగానే మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ ఘటనాస్థలానికి చేరుకుని  పరిశీలించారు. సహాయచర్యల్లోని అధికారులతో మాట్లాడారు. ఆ తర్వాత మీడియాతో మాట్లాడారు. ఈ ఘటన చాలా బాధాకరమన్న తలసాని.. ప్రమాదంపై విచారణకు ఆదేశించామని తెలిపారు. బాధిత కుటుంబాలను అన్ని విధాలుగా ఆదుకుంటామన్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: