‘నువ్వొకటంటే నేను రెండంటా..నువ్వు తమలపాకుతో ఒకటిస్తే నేను తలుపుచెక్కతో రెండిస్తా’ ఇలా సాగుతోంది చంద్రబాబునాయుడు, విజయవాడ ఎంపీ కేశినేని మధ్య వ్యవహారం. ఇపుడిదంతా ఎందుకంటే చంద్రబాబు ఢిల్లీకి వెళ్ళారు. అక్కడ రెండు ఆసక్తికరమైన సంఘటనలు జరిగాయి. మొదటిదేమో ఎయిర్ పోర్టులో చంద్రబాబు దిగగానే ఎంపీలు గల్లా జయదేవ్, కేశినేని నాని, కింజరాపు రామ్మోహన్ నాయుడు, కనకమేడల రవీంద్రకుమార్ స్వాగతం పలికారు.

ఎయిర్ పోర్టులో దిగగానే అందరితో పాటు నాని కూడా చంద్రబాబుకు నమస్కారం చేశారు. అయితే నానీని చంద్రబాబు పట్టించుకోలేదు. తనకు కుడివైపు ఉన్న జయదేవ్ తో మాట్లాడుతు చంద్రబాబు బయటకు వచ్చేశారు. చంద్రబాబుకు నాని ఎడమవైపున నిలబడ్డారు. ఎడమవైపుకు తిరిగితే నానీని చూడాల్సొస్తుందన్న ఉద్దేశ్యంతో చంద్రబాబు పూర్తిగా గల్లాతోనే మాట్లాడుతు ఎయిర్ పోర్టు బయటకు చేరుకున్నారు.

తర్వాత చంద్రబాబుకు ఎంపీలందరు కలిసి ఒక బొకేను అందించారు. నానీకి పూలబొకేని అందించి చంద్రబాబుకు ఇవ్వమని జయదేవ్ చెప్పారు. అయితే ఆ బొకేని అందుకుని చంద్రబాబుకు ఇవ్వటానికి నాని ఇష్టపడలేదు. జయదేవ్ ఇచ్చిన బొకేని తీసుకోవటానికి నిరాకరించిన నాని దాన్ని అందుకోకుండా మళ్ళీ జయదేవ్ వైపుకే తోసేశారు. ఇదంతా చంద్రబాబు చూస్తున్నారు తప్ప ఏమీ మాట్లాడలేదు.
అంటే అంతకుముందు తాను నమస్కరించినా చంద్రబాబు పట్టించుకోలేదు కాబట్టే తర్వాత చంద్రబాబుకు బొకే ఇవ్వటానికి నాని ఇష్టపడలేదని అర్ధమైపోతోంది. పైన చెప్పిన విషయమంతా టీవీల్లో స్పష్టంగా లైవ్ లో కనబడిందే. నానీతో మాట్లాడటానికి చంద్రబాబు ఇష్టపడటంలేదు. ఇదే సమయంలో చంద్రబాబుతో రాజీపడేందుకు నానీకూడా ఇష్టపడటంలేదని అర్ధమైపోతోంది. ఇద్దరి మధ్యా పెరిగిపోతున్న గ్యాప్ కారణంగా చివరకు విజయవాడ ఎన్టీయార్ జిల్లాలో అంతిమంగా నష్టపోయేది పార్టీయే. ఎంపీ ఇంట్లోనే  చిచ్చుపెట్టాలని చంద్రబాబు అనుకోవటంతోనే ఈ పరిస్ధితులు తలెత్తాయి. జిల్లాలో ఎంపీకి వ్యతిరేకంగా బోండా ఉమ, బుద్ధావెంకన్న, నాగూల్ మీరా జట్టుగా తయారయ్యారు. వీళ్ళమధ్య సయోధ్యచేసేందుకు ప్రయత్నించినా సాధ్యంకాకపోవటంతో చంద్రబాబు చేతులెత్తేశారు. చివరకు వీళ్ళ గొడవలు ఎక్కడికి  దారితీస్తుందో చూడాల్సిందే.మరింత సమాచారం తెలుసుకోండి: