సంక్రాంతి పండుగకు ఇంకా దాదాపు 25 రోజుల సమయం ఉన్నప్పటికీ… ఉభయ గోదావరి జిల్లాల్లో మాత్రం ఇప్పటి నుంచే పందెం కోళ్లు “కొక్కురకో…” అంటున్నాయి. బరులు గీస్తున్నారు… గిరిలు పడుతున్నాయి … వాటాలు కుదురుతున్నాయి. జిల్లాకు ఇద్దరు చొప్పున నాయకులు కూడా ఆధిపత్యం కోసం రంగంలోకి దిగారు. కోడి పందేలు, ఇతర సంప్రదాయ కార్యక్రమాల పేరుతో భారీ హడావుడికి పూర్తిగా రెడీ అయ్యారు. కానీ… ఈసారి “ఎప్పుడూ జరిగేదే కదా” అంటూ సరిపెట్టుకునే పరిస్థితి మాత్రం లేదు. ఎందుకంటే… ఈసారి వాటాల కోసం అందరూ ఒక్కటయ్యారు! పార్టీలు, రాజకీయాలు, సిద్ధాంతాలు అన్నీ పక్కనపెట్టి… పందెం కోళ్ల దగ్గర మాత్రం అందరూ కలసి కట్టుగా నిలిచారు.
 

టీడీపీ – వైసీపీ – ఇతర పార్టీలన్న తేడా లేకుండా… సంక్రాంతి సంప్రదాయం పేరుతో “సామూహిక ఐక్యత” కనిపిస్తోంది. ఉభయ గోదావరి జిల్లాల్లో ఎప్పుడూ ఉండే ఈ సంస్కృతి… ఇప్పుడు అదే ఊపుతో కృష్ణా, గుంటూరు, నెల్లూరు జిల్లాలకు కూడా విస్తరించింది. ఇక్కడ కూడా ఈసారి భారీ ఎత్తున బరులు సిద్ధమవుతున్నాయట. చిత్రమేంటంటే… రాజకీయాల్లో పరస్పరం దూషణలు, ఆరోపణలు చేసుకునే నాయకులే… ఇక్కడ మాత్రం ఒకరి దగ్గర ఒకరు సొమ్ములు పెట్టుకుంటున్నారు. చాలామంది టీడీపీ నేతలు వైసీపీ వాళ్ల నుంచి… వైసీపీ నేతలు ఇతర పార్టీ నాయకుల నుంచి డబ్బులు తీసుకుంటున్నారనే ప్రచారం జిల్లాలన్నీ చుట్టేస్తోంది. “పండుగ సంప్రదాయాలకు రాజకీయాలు అడ్డు రావద్దు” అన్నది ఇప్పుడు అందరి కామన్ డైలాగ్‌గా మారింది. ఇప్పటికే ఎవరు ఏ బరులు తీసుకోవాలి, ఏ ప్రాంతంలో ఎవరి ఆధిపత్యం ఉండాలి అన్నది కూడా ఖరారైనట్టు సమాచారం.

 

రెండు రోజుల కిందట పశ్చిమ గోదావరిలోని ఓ నియోజకవర్గంలో పెద్ద సమావేశం నిర్వహించి… జిల్లా వ్యాప్తంగా బరుల వ్యవహారంపై కీలక నిర్ణయాలు తీసుకున్నారట. అసలు ఉద్దేశం ఒక్కటే… ఎవ్వరూ ఎవ్వరిని ఇబ్బంది పెట్టకూడదు. పోలీసులకు సమాచారం ఇవ్వడం, మీడియాకు లీకులు, కోర్టు పిటిషన్లు… ఇవన్నీ లేకుండా అందరూ కలిసి “పది పెట్టి వంద తీసుకోవాలి” అన్నదే వ్యూహం. ఇదిలా ఉంటే… గుంటూరుకు చెందిన ఓ మాజీ ఎంపీ పశ్చిమ గోదావరిలో బరులను లీజుకు తీసుకున్నట్టు సమాచారం. మరోవైపు నెల్లూరు జిల్లాకు చెందిన వైసీపీ నేత ఒకరు గుడివాడలో బరులకు సిద్ధమయ్యారని గుసగుస. మొత్తానికి… అందరూ కలివిడిగా పందెం కోళ్లతో ఏకమయ్యారు! .. అయితే… ఇదే కలివిడి అభివృద్ధిలోనూ ఉంటే బాగుండేది కదా? అన్న ప్రశ్న మాత్రం అడగొద్దంటున్నారు. ఎందుకంటే… అది అడిగితే పండుగ మూడ్ పాడవుతుందట!

మరింత సమాచారం తెలుసుకోండి: