చివరకు ఏమవుతుందో తెలీదు కానీ కడప ఎంపీ అవినాష్ రెడ్డి, ఆయన తండ్రి భాస్కరరెడ్డిని సీబీఐ అస్సలు వదలటంలేదు. వివేకానందరెడ్డి హత్యకేసులో వీళ్ళిద్దరే అసలు సూత్రదారులని సీబీఐ బలంగా అనుమానిస్తోంది. అనుమానాలైతే ఉన్నాయి కానీ అందుకు తగ్గ గట్టి ఆధారాలను సేకరించలేకపోతున్నది. వీళ్ళే సూత్రదారులను చెప్పేందుకు సీబీఐ చూపిస్తున్న ఆధారాలు లాజికల్ గా ఏమంతా బలమైనవిగా కనబడటంలేదు. సీబీఐ వాదన  ఏమిటంటే హత్యకేసులో ఇప్పటికే అరెస్టయి, విచారణను ఎదుర్కొంటున్న నిందితులంతా ఎంపీకి సన్నిహితులవ్వటమే.





అలాగే వివేకా హత్య జరిగిన సమయంలో వీళ్ళంతా అవినాష్ రెడ్డి ఇంటి ప్రాంతంలో ఉన్నారని గూగుల్ టే కౌట్ అనే సాంకేతిక పరిజ్ఞానం ఆధారంగా నిర్ధారణ అయ్యింది కాబట్టి హత్యలో ఎంపీతో పాటు ఆయన తండ్రిది కీలకపాత్రని సీబీఐ వాదిస్తోంది. సరే అంతిమంగా ఈ ఆధారాలు కోర్టు విచారణలో నిలుస్తుందా లేదా అన్నది వేరేసంగతి. ఇప్పుడైతే సీబీఐ తండ్రి, కొడుకుల వెంటపడిందన్నది వాస్తవం. ఇప్పటికే ఎంపీని హైదరాబాద్ ఆఫీసులో దర్యాప్తు సంస్ధ రెండుసార్లు విచారించింది. తనను కేవలం సాక్షిగా మాత్రమే దర్యాప్తుసంస్ధ విచారిస్తోందని ఎంపీ చెప్పుకుంటున్నారు.





ఈ రోజు మరోసారి విచారణకు హాజరుకావాలని సీబీఐ నోటీసులిస్తే కుదరదని ఎంపీ చెప్పేశారు. తనకు ముందుగానే నిర్ణయించిన ప్రోగ్రాములున్న కారణంగా మరోరోజు కేటాయించాలన్నారు. అలాగే ఎంపీ తండ్రిని కూడా సీబీఐ విచారణకు రావాలని నోటీసులు జారీచేసింది. ముందేమో ఈనెల 12వ తేదీన హాజరుకావాలన్న సీబీఐ శనివారం విచారణను 6వ తేదీకే మార్చింది. కడపలో జైళ్ళ గెస్ట్ హౌస్ లోనే భాస్కర్ ను విచారించేందుకు అధారులు రంగం సిద్ధంచేశారు.





మరి భాస్కర్ విచారణకు హాజరవుతారా లేదా అన్నది ఆసక్తిగా మారింది. అలాగే ఎంపీ విచారణ ఏమవుతుందో చూడాలి. సీబీఐ తనిష్టప్రకారం విచారణ తేదీలను మార్చటం కుదరదని ఎంపీ అంటున్నారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో కూడా విచారణకు పిలిచి పిలిచి చివరకు ఒక్కొక్కరిని సీబీఐ అరెస్టు చేసింది. అదే పద్దతిలో ఎంపీ, ఆయన తండ్రిని కూడా సీబీఐ అరెస్టు చేస్తుందనే ప్రచారం బాగా పెరిగిపోతోంది.  మరి చివరకు ఏమవుతుందో చూడాల్సిందే.






మరింత సమాచారం తెలుసుకోండి: