జనసేన అధినేత పవన్ కల్యాణ్ నిర్ణయం తీసేసుకున్నట్లే ఉన్నారు. రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశంపార్టీతో మాత్రమే కలిసి వెళ్ళాలని డిసైడ్ అయినట్లున్నారు. కృష్ణాజిల్లా అవనిగడ్డలో మొదలైన వారాహియాత్రలో పవన్ మాట్లాడుతు రాబోయేది టీడీపీ-జనసేన సంకీర్ణ ప్రభుత్వమే అని స్పష్టంగా ప్రకటించారు. ఈ సంకీర్ణం అధికారంలోకి వస్తుందా రాదా అన్నది వేరే సంగతి. తమ రెండుపార్టీల పేర్లు మాత్రమే ప్రస్తావించారు కానీ బీజేపీని ప్రస్తావించలేదు.

ఇక్కడ విచిత్రం ఏమిటంటే పవన్ ప్రస్తుతం ఎన్డీయే పార్టనర్. ఎన్డీయేలో టీడీపీ పార్టనర్ కాదు. ఎన్డీయేలో పార్టనర్ గా ఉంటూనే సంబంధంలేని టీడీపీతో అందులోనే నరేంద్రమోడీ తీవ్రంగా వ్యతిరేకిస్తున్న చంద్రబాబునాయుడుతో చేతులు కలిపారు. మరి ఇప్పటికే మిత్రపక్షంగా ఉన్న బీజేపీ మాటేమిటి ? అనే ప్రశ్నకు పవన్ సమాధానం చెప్పటంలేదు. మొన్నటివరకు టీడీపీతో పొత్తుకు బీజేపీని ఒప్పించే బాధ్యతను తీసుకుంటానని, ఢిల్లీ పెద్దలతో మాట్లాడుతానని చెప్పేవారు. తాజాగా ఆ మాట కూడా చెప్పలేదు. ఏకంగా టీడీపీ, జనసేన సంకీర్ణమే అధికారంలోకి వచ్చేస్తుందని ప్రకటించేశారు.

దీంతోనే అర్ధమైపోతోంది పవన్ మిత్రపక్షం బీజేపీని వదిలేయటానికి రెడీ అయిపోయారని. కాకపోతే తనంతట తానుగా బీజేపీని వదిలేసినట్లు కాకుండా బీజేపీనే తనతో తెగతెంపులు చేసుకునేట్లు చేయాలని ఆలోచిస్తున్నట్లు సమాచారం. నిజంగానే బీజేపీని పొత్తుకు ఒప్పించే ఉద్దేశ్యమే ఉంటే మూడుపార్టీల పేర్లను ప్రస్తావించుండే వారే. కానీ అలాచేయకుండా మాట్లాడినంతసేపు కేవలం టీడీపీ, జనసేన గురించి మాత్రమే చెప్పారు. టీడీపీతో చేతులు కలపటానికి నరేంద్రమోడీ ఏమాత్రం ఇష్టపడటంలేదు. టీడీపీతో పొత్తు విషయాన్ని పవన్ గతంలో ఒకసారి ప్రస్తావించినా సానుకూలంగా స్పందించలేదనే ప్రచారం అందరికీ తెలిసిందే.

తమతో బీజేపీ కలిసిరాదన్న విషయం పవన్ కు అర్ధమైనట్లుంది. అందుకనే బీజేపీని వదిలేసి తమ రెండుపార్టీల గురించే చెప్పుకుంటున్నారు. పైగా మోడీ కానీ అమిత్ షా కానీ అసలు పవన్ కు అపాయిట్మెంటే ఇవ్వటంలేదు. పొత్తుల విషయాన్ని ఫైనల్ చేయాల్సింది మోడీనే కానీ మరోకళ్ళు కాదు. జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతోనో లేకపోతే ఏపీ ఇన్చార్జి మురళీధరన్ తో ఎంత మాట్లాడినా ఉపయోగం ఉండదు. స్కిల్ స్కామ్ లో చంద్రబాబునాయుడు అరెస్టువెనుక బీజేపీ పెద్దలున్నారని తమ్ముళ్ళు బలంగా నమ్ముతున్నారు. ఈ నేపధ్యంలోనే  బీజేపీని వదిలేసి టీడీపీతో వెళ్ళాలని పవన్ నిర్ణయించుకున్నట్లు అర్ధమవుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: