
తాజా ఎన్నికల ఫలితాలు కేసీయార్ మొహం మీద చాచికొట్టినట్లే ఉన్నాయి. ఫలితాలు మూడు రకాలుగా కేసీయార్ కు షాక్ ఇచ్చాయని చెప్పాలి. మొదటిది అధికారం కోల్పోవటం. రెండోది కామారెడ్డిలో ఓడిపోవటం. మూడోది గెలిచిన గజ్వేలులో కూడా ఏదో గెలిచామంటే గెలిచామన్నట్లుగా బయటపడటం. బహుశా ఈ మూడింటిని కేసీయార్ ఏమాత్రం ఊహించుండరు. తాను లేకపోతే తెలంగాణా ఏమైపోతుందో అన్నంతగా బిల్డప్ ఇచ్చారు.
పదేళ్ళుగా అధికారంలో ఉండటం వల్ల పెరిగిపోయిన అహంకారాన్ని తెలంగాణా ప్రజలు ముఖ్యంగా కామారెడ్డి ఓటర్లు కోలుకోలేని దెబ్బకొట్టారు. గజ్వేలులో ఓటమి భయంతోనే కామారెడ్డిలో కేసీయార్ పోటీచేస్తున్నారని ప్రతిపక్షాలతో పాటు జనాలు కూడా అనుకున్నారు. అయితే మరీ మూడోస్ధానానికి పడిపోతారని మాత్రం ఎవరూ ఊహించలేదు. కామారెడ్డిలో ఓట్ల కౌంటింగ్ మొదలైన దగ్గర నుండి ఏ ఒక్క రౌండులో కూడా మొదటి స్ధానంలో నిలవలేదు. కౌంటింగ్ మొదలవ్వటమే మూడోరౌండులో ఉండిపోయారు. అప్పటినుండి ఇక మళ్ళీ కనీసం రెండో రౌండుకు కూడా చేరుకోలేకపోయారు.
ఇక గజ్వేలులో గెలిచారు. అయితే ఈ గెలుపు కూడా ఒక గెలుపేనా అన్నట్లుగా ఉంది. ఎందుకంటే కేసీయార్ లాంటి తెలంగాణా ఛాంపియన్ నామినేషన్ వేస్తే పోటీచేయటానికి ప్రత్యర్ధులు భయపడాలి. అలాంటిది ముక్కీమూలిగి 12వ రౌండులో 20 వేల ఓట్ల మెజారిటితో ఉన్నారంటే అర్ధమేంటి ? అసలు కేసీయార్ స్ధాయికి లక్ష ఓట్లకు మెజారిటి తగ్గనే కూడదు. అలాంటిది అతికష్టంమీద లాక్కొస్తున్నారు. అంటే గజ్వేలు, కామారెడ్డిలో జనాలకు కేసీయార్ అంటే ఎంతస్ధాయిలో మంటుందో అర్ధమైపోతోంది.
కేసీయార్ మీద జనాలకున్న మంటకు కారణం ఏమిటంటే అహంకారం అలవిమీరిన అహంకారమే కారణం. ప్రతిపక్షాలంటే లెక్కలేదు. మామూలు జనాలను పట్టించుకున్నదే లేదు. ఎవరికీ అందుబాటులో ఉండేదిలేదు. తాను అనుకున్నపుడు మాత్రమే మాట్లాడుతారంతే. జనాలకు అవసరమైతే అసలు అందుబాటులోనే ఉండరు. కేసీయార్లోని ఈ లక్షణాలను జనాలు సహించలేకపోయారు. తెలంగాణా వచ్చిందంటే అది కేసీయార్ ఒక్కరి వల్లే రాలేదన్న విషయం అందరికీ తెలుసు. ముఖ్యంగా సోనియాగాంధి ఇవ్వాలని అనుకున్నారు కాబట్టే తెలంగాణా వచ్చింది. సరే విషయం ఏదైనా తాజా ఎన్నికలు కేసీయార్ కు పెద్ద షాక్ కొట్టిందనే చెప్పాలి.