తెలంగాణా వ్యాప్తంగా మహిళల ఉచిత ప్రయాణానికి ముహూర్తం ఫిక్సయ్యింది. శనివారం అంటే 9వ తేదీన సోనియాగాంధి పుట్టినరోజు. ఆ రోజునుండి మహిళలంతా ఉచితంగా ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణం చేయవచ్చని రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన క్యాబినెట్ సమావేశంలో నిర్ణయమైంది. జనాలకు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన సిక్స్ గ్యారెంటీస్ అమలుపై క్యాబినెట్లో సుదీర్ఘ చర్చే జరిగింది. పార్టీ అధికారంలోకి రాగానే 100 రోజుల్లో సిక్స్ గ్యారెంటీస్ అమలు చేస్తామని ఎన్నికల్లో హామీ ఇచ్చింది.

ఆ గ్యారెంటీస్ పైనే క్యాబినెట్ చర్చించింది. ఇందులో రెండు గ్యారెంటీలు మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, రు. 10 లక్షలు విలువైన ఆరోగ్యశ్రీ బీమా పథకాన్ని వెంటనే అమల్లోకి తీసుకురావాలని సమావేశం నిర్ణయించింది. సోనియాగాంధి పుట్టినరోజు సందర్భంగా ముందు ఈ రెండు గ్యారెంటీలను అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. మిగిలిన నాలుగు గ్యాంరెటీలను కూడా దశలవారీగానే 100 రోజుల్లోనే అమల్లోకి తీసుకురావాలని కూడా డిసైడ్ చేసింది. అయితే బస్సుల్లో ఉచితంగా ప్రయాణించే మహిళలు గుర్తింపుకార్డులను తప్పకుండా చూపించాల్సుంటుంది.

తమ గుర్తింపుగా మహిళలు ఆధార్ కార్డు లాంటి ఏదో ఒక గుర్తింపుకార్డయితే చూపాల్సుంటుంది. ఇక్కడే ఒక సందేహం వస్తోంది. ఉచిత ప్రయాణం అన్న తర్వాత ఇక గుర్తింపుకార్డులతో ఏమి అవసరమో అర్ధంకావటంలేదు. ప్రయాణంచేసే మహిళలకు గుర్తింపుకార్డులు ఉంటే ఏమిటి ? లేకపోతే ఏమిటి ? స్టూడెంట్స్ కు ఆర్టీసీ బస్సుల్లో రాయితీలిస్తున్నది ప్రభుత్వం. కాబట్టి స్టూడెంట్ అని గుర్తుగా కాలేజీ ఐడీ కార్డు చూపించాలని ప్రభుత్వం నిబంధన విధించింది. ఇందులో ఎలాంటి తప్పులేదు. లేకపోతే ఎవరుపడితే వాళ్ళు స్టూడెంట్సని ప్రయాణం చేసే అవకాశముంది.

బస్సులో  ప్రయాణం పూర్తిగా ఉచితమన్నపుడు గుర్తింపుకార్డులు చూపాలని ప్రభుత్వం ఎందుకు నిర్ణయించిందో అర్ధంకావటంలేదు. ప్రయాణం చేసేవాళ్ళు మహిళా కాదా అన్నదే ముఖ్యంకాని గుర్తింపుకార్డులున్నాయా లేదా అన్నది కాదు. మరీ నిబంధన ఎందుకుపెట్టిందో ప్రభుత్వానికే తెలియాలి. ఇపుడు ఆర్టీసీలో అనేక రకాల క్యాటగిరీ బస్సులున్నాయి. అన్నీ క్యాటగిరీల్లోను ఉచితంగా ప్రయాణం చేయచ్చా ? లేకపోతే కొన్ని క్యాటగిరీల్లోనే ఉచిత ప్రయాణమా అన్నది క్లారిటిలేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: