తెలంగాణ రాష్ట్రంలోని జూబ్లీహిల్స్ తరపున ఎమ్మెల్యేగా ప్రాతినిథ్యం వహిస్తున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ గుండెపోటుతో ఆస్పత్రిలో చేరి ఈరోజు ఉదయం 5.45 గంటలకు కన్నుమూశారు. బీఆర్ఎస్ పార్టీ శ్రేణుల్లో ఈ వార్త విషాదాన్ని నింపింది. పార్టీలో మంచి నేతగా పేరున్న మాగంటి గోపీనాథ్ రెండు రోజుల క్రితం తీవ్ర అస్వస్థతకు గురి కాగా ఆయనను గచ్చిబౌలిలోని ఏఐజీ ఆస్పత్రికి తరలించగా అక్కడ చికిత్స తీసుకుంటూ మృతి చెందారని సమాచారం.
 
మాగంటి గోపీనాథ్ అస్వస్థతకు గురైన వెంటనే పార్టీ కీలక నేతలలో ఒకరైన హరీష్ రావుతో పాటు ఇతర ముఖ్య నేతలు హుటాహుటిన ఏఐజీ ఆస్పత్రికి చేరుకుని పరామర్శించారు. మాగంటి గోపీనాథ్ మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. ఆయన స్వస్థలం కృష్ణా జిల్లాలోని పామర్రు. మాగంటి గోపీనాథ్ కిడ్నీ సమస్యతో పాటు ఇతర అనారోగ్య సమస్యలతో గత కొంతకాలంగా బాధ పడుతున్నారని తెలుస్తోంది.
 
గతంలో ఏఐజీ ఆస్పత్రిలో ఆయన చికిత్స తీసుకున్నారని సమాచారం. మాగంటి గోపీనాథ్ మరణ వార్త తెలిసి తెలంగాణ రాష్ట్రంలోని ఇతర పార్టీల నేతలు సైతం సంతాపం తెలియజేస్తున్నారు. మాగంటి గోపీనాథ్ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నారు. 2014 సంవత్సరంలో టీడీపీ నుంచి గెలిచిన మాగంటి గోపీనాథ్ తర్వాత రోజుల్లో భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని బీఆర్ఎస్ పార్టీలో చేరారు.
 
2018, 2023 ఎన్నికల్లో జూబ్లీహిల్స్ నుంచి గెలిచిన ఆయన గత ఎన్నికల్లో కీలక నేత అజారుద్దీన్ ను ఓడించారు. 1983 సంవత్సరం నుంచి మాగంటి గోపీనాథ్ రాజకీయాల్లో యాక్టివ్ గా ఉన్నారు. ఆయన తన పొలిటికల్ కెరీర్ లో వేర్వేరు పదవులలో పని చేసి మంచి పేరు సంపాదించుకున్నారు. సౌమ్యుడిగా, మృదు స్వభావిగా మాగంటి గోపీనాథ్ పేరు తెచ్చుకున్నారు. మాగంటి గోపీనాథ్ జీవించి లేరనే వార్తను నమ్మలేకపోతున్నామని చెబుతూ బీఆర్ఎస్ నేతలు కంటతడి పెడుతున్నారు. రెండు రోజుల క్రితం మధ్యాహ్న సమయంలో ఆయన కుప్పకూలిపోయారని ఏడాది కాలంగా గోపీనాథ్ పబ్లిక్ కు దూరంగా ఉన్నారని సమాచారం.


మరింత సమాచారం తెలుసుకోండి: