
చంద్రబాబు ఢిల్లీ షెడ్యూల్ : అభివృద్ధి – గ్రాంట్లపై దృష్టి : జూలై 15, 16 తేదీల్లో ఢిల్లీ పర్యటన చేపట్టిన చంద్రబాబు, రాష్ట్ర ప్రాజెక్టుల పురోగతిని వేగవంతం చేసేందుకు కీలక కేంద్ర మంత్రులతో సమావేశమవుతున్నారు. హోం మంత్రి అమిత్ షా, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, జలశక్తి మంత్రి సి.ఆర్ పాటిల్, నీతి ఆయోగ్ సభ్యుడు వీకే సారస్వత్, ఐటీ శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్, డిల్లీ మెట్రో ఎండీ డాక్టర్ వికాస్ కుమార్ తో భేటీలు జరగనున్నాయి. అలాగే పోలవరం, బనకచర్ల ప్రాజెక్టు, గ్రామీణ ఉపాధి పథకాలు, ఐటీ పెట్టుబడులు తదితర అంశాలపై చర్చ జరగనుంది. జూలై 17న చంద్రబాబు తిరిగి అమరావతికి చేరుకుంటారు.
రేవంత్ రెడ్డి పర్యటన: బీసీ రిజర్వేషన్లు – కాంగ్రెస్ అధిష్ఠానం .. ఇక తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కూడా జూలై 16, 17 తేదీల్లో ఢిల్లీలో పర్యటించనున్నారు. ఆయన ప్రధానంగా బీసీ రిజర్వేషన్లపై కేంద్రంతో చర్చ, అలాగే పార్టీ అధిష్ఠానంతో సమావేశం కానున్నారు. ఇందుకోసం ముందుగానే ఏర్పాట్లు చేసినట్లు సమాచారం.
ఒకే వేదికపై ఇద్దరు సీఎంలు ? జూలై 15న సాయంత్రం ఢిల్లీలో జరగనున్న పీవీ నరసింహారావు జయంతి సభకి ఇద్దరూ ముఖ్యమంత్రులు హాజరవుతారు. దీంతో వారిద్దరూ ఒకే వేదికను పంచుకోబోతున్నారన్న విషయమే పెద్ద చర్చకు దారితీస్తోంది. ఇటీవల బనకచర్ల నీటి ప్రాజెక్టుపై రెండు రాష్ట్రాల మధ్య ఉద్రిక్తతలు నెలకొన్న నేపథ్యంలో, ఈ భేటీని రాజకీయ విశ్లేషకులు ప్రత్యేకంగా గమనిస్తున్నారు. ఇద్దరు సీఎంల ఢిల్లీ పర్యటనలు ప్రత్యేకంగా కనిపించినా, భవిష్యత్తులో రాష్ట్రాల పరస్పర సహకారానికి బీజం పడే అవకాశాలు ఉన్నాయని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. కేంద్రంపై ఒత్తిడి పెంచే ప్రయత్నంగా కూడా ఇది మలచుకోవచ్చు. ఇది కేవలం అధికార పర్యటన కాదు… రాజకీయ వ్యూహాలకు బలమైన వేదిక కావొచ్చు!