
ఎన్నికలకు ముందు అలవి కాని హామీలను ఇచ్చిన కూటమి ఆ హామీలను అమలు చేయడానికి ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంటోంది. గతేడాది ఒకటి రెండు పథకాలు మినహా ఎక్కువ పథకాలు అమలు చేయని కూటమి సర్కార్ ప్రజల్లో నెలకొన్న అసంతృప్తిని గమనించి తల్లికి వందనం పథకాన్ని జూన్ నెలలో అమలు చేయగా మరికొన్ని గంటల్లో అన్నదాత సుఖీభవ పథకం అమలు కానుంది. అయితే గతంతో పోల్చి చూస్తే ఈ పథకం యొక్క లబ్ధిదారుల సంఖ్య మాత్రం భారీగా తగ్గింది.
అయితే కౌలు రైతులకు మాత్రం 7,000 రూపాయలకు బదులుగా 14,000 రూపాయలు జమ చేసే దిశగా కూటమి సర్కార్ అడుగులు వేయడంపై కౌలు రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఆగష్టు నెల 15వ తేదీ నుంచి పల్లె వెలుగు, ఎక్స్ ప్రెస్, మెట్రో ఎక్స్ ప్రెస్, సిటీ ఆర్డినరీ బస్సుల్లో మహిళలు ఉచితంగా ప్రయాణం చేసేలా నిర్ణయం తీసుకుంది. మొదట జిల్లాల పరిధి మేరకే ఫ్రీ బస్ స్కీమ్ అమలు చేయాలని భావించినా తర్వాత కూటమి సర్కార్ ఈ నిర్ణయాన్ని మార్చుకుంది.
అన్న క్యాంటీన్, దీపం పథకాల అమలు సైతం లక్షల సంఖ్యలో ప్రజలకు ప్రత్యక్షంగా, పరోక్షంగా లాభం చేకూరుస్తున్నాయి. అయితే నిరుద్యోగ భృతి, 50 ఏళ్లకే పింఛన్, ఐదేళ్ళలో 20 లక్షల ఉద్యోగాల కల్పన, పేద మహిళలకు నెలకు 1500 రూపాయలు ఇచ్చే ఆడబిడ్డ నిధి తరహా పథకాలను మాత్రం అమలు చేయడంలో విఫలమవుతోంది. భవిష్యత్తులో సైతం రాష్ట్ర ఆర్ధిక పరిస్థితుల వల్ల ఈ పథకాలు అమలు చేయడం సులువు కాదు.