
ఈ టైటిల్ నూటికి నూరు శాతం నిజమే. నామినేటెడ్ పదవులు భర్తీ చేయడంలో జనసేన పార్టీకి ఇప్పుడు పెద్ద సవాలే ఎదురవుతోంది. కూటమి ప్రభుత్వంలో కీలక పాత్ర పోషిస్తున్న జనసేనకు భాగస్వామ్యంగా నామినేటెడ్ పదవులు వస్తున్నా వాటిని భర్తీ చేసే అర్హులైన నాయకులు కనిపించడం లేదు. ఇప్పటివరకు కొందరికి ఇచ్చిన పదవుల విషయం పక్కన పెడితే, ఇక ముందు కనీసం 30కి పైగా పదవులు జనసేన కు కేటాయించనున్నారు. వీటిని జనసేన భర్తీ చేసుకోకపోతే చివరకు టీడీపీ వాళ్లతోనే వీటిని నింపేసే అవకాశం ఉందని పార్టీ అంతర్గత వర్గాలు చెబుతున్నాయి. ఇది నిజంగా పార్టీ కి పెద్ద మైనస్సే అవుతుంది.
ఈ పరిస్థితిలో, తిరుపతి, నిడదవోలు, కాకినాడ రూరల్ వంటి నియోజకవర్గాల్లో పదవులు ఇస్తాం , సరైన నాయకులను వెతకండని పార్టీ లోపలే చర్చలు జరుగుతున్నాయి. టీడీపీలో అయితే అధిక సంఖ్యలో నాయకులు ఉండటం వల్ల పదవులు కేటాయించడం కష్టంగా మారుతుంటే, జనసేనలో మాత్రం లోటు స్పష్టంగా కనిపిస్తోంది. ఈ లోటును పూడ్చేందుకు వైసీపీ నేతలను చేర్చుకుని వారికి పదవులు ఇవ్వాలనే ప్రతిపాదన వచ్చినా, పార్టీ అధిష్ఠానం దానిని తిరస్కరించిందన్న ప్రచారం ఉంది. దీంతో ఆయా నియోజకవర్గాల ఎమ్మెల్యేలు తలపట్టుకుంటున్నారు.
స్థానికంగా కొందరు నేతలు ఉన్నా , వారికి ఈ స్థాయి పదవులు ఇవ్వాలా అన్న సందేహం ఉంది. కానీ మౌనం వహిస్తే , ఆ స్థానాల ను టీడీపీ నేతల తో నింపేస్తారు. అలా జరిగితే, భవిష్యత్తు లో తమకే ఇబ్బందులు వస్తాయని ఎమ్మెల్యేల ఆందోళన. ఇప్పటికే కొన్ని నియోజకవర్గా ల్లో నామినేటెడ్ పదవులు పొందిన టీడీపీ నేతల వల్ల జనసేన నాయకులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని చెబుతున్నారు. ఇప్పుడు మరికొందరికి అవకాశం ఇస్తే సమస్యలు మరింత పెరుగుతాయని భావిస్తున్నారు.