అనంతపురం జిల్లాలో తాడిపత్రి పేరు వినగానే గుర్తొచ్చేది కేతిరెడ్డి – జేసీ కుటుంబాల మధ్య ఉన్న కక్షలు. ఇరువురి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేంతగా విభేదాలు కొనసాగుతున్నాయి. తాజాగా ఈ రెండు వర్గాల మధ్య వివాదం మళ్లీ ముదిరే అవకాశం కనిపిస్తోంది. హైకోర్టు సోమవారం కీలక తీర్పు వెలువరించింది. మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డిని ఉదయం 10 నుంచి 11 గంటల మధ్యలో పోలీసులు తాడిపత్రికి తీసుకెళ్లాలని ఆదేశించింది. ఎవరి వల్లనైనా ఇబ్బంది కలిగితే, అవసరమైతే పోలీస్ ఫోర్స్ వినియోగించాలని కూడా స్పష్టంగా సూచించింది. అంతేకాదు.. ఆయనకు పూర్తి స్థాయి భద్రత కల్పించాలని కూడా ఆదేశాలు ఇచ్చింది. దీంతో పెద్దారెడ్డి తాడిపత్రి ఎంట్రీకి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. శింగనమల నియోజకవర్గం యల్లనూరు మండలం తిమ్మంపల్లి నుంచి ఆయన బయలుదేరి వెళ్లనున్నారు.


ఇక మరోవైపు, తాడిపత్రిలో జేసీ ప్రభాకర్ రెడ్డి పెద్ద ఎత్తున కార్యక్రమం ఏర్పాటు చేశారు. ధ్యాన శివుడి విగ్రహావిష్కరణకు ఏర్పాట్లు పూర్తి చేసుకున్నారు. ఈ సందర్భంగా కార్యకర్తలు భారీగా తరలిరావాలని పిలుపునిచ్చారు. దీంతో తాడిపత్రి వాతావరణం మరింత ఉద్రిక్తంగా మారింది. ఒకవైపు కేతిరెడ్డి కోర్టు గ్రీన్ సిగ్నల్‌తో తాడిపత్రిలో అడుగుపెడుతుండగా, మరోవైపు జేసీ వర్గం విగ్రహావిష్కరణకు పట్టుబడటంతో పోలీసులు ఆందోళన చెందుతున్నారు. ఇరువర్గాలు తలపడే అవకాశం ఉందనే అంచనాతో పోలీసులు ఇప్పటికే రంగంలోకి దిగారు. జేసీ ప్రభాకర్ రెడ్డికి శివుడి విగ్రహావిష్కరణ కార్యక్రమాన్ని వాయిదా వేసుకోవాలని నోటీసులు ఇచ్చారు. అయినప్పటికీ, “మేం ఎలాగైనా ఈవెంట్ చేస్తాం” అని జేసీ వర్గం పట్టుబడుతోంది. దీంతో తాడిపత్రి శాంతిభద్రతల పరిరక్షణ కోసం భారీ బలగాలను మోహరించారు.



ఇంతకుముందు పెద్దారెడ్డి దాఖలు చేసిన ధిక్కారణ పిటిషన్‌పై విచారణ చేసిన హైకోర్టు, గతంలో పోలీసులు తన ఆదేశాలను అమలు చేయకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేసింది. అదే సమయంలో 18న తాడిపత్రి వెళ్లేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈసారి మాత్రం తాడిపత్రిలో ఎలాంటి అల్లర్లు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని హైకోర్టు పోలీసులు గట్టిగా హెచ్చరించింది. ఇక ఈ పరిణామాల వల్ల తాడిపత్రిలో పరిస్థితి హైటెన్షన్‌గా మారింది. ఒకవైపు పెద్దారెడ్డి రాక, మరోవైపు జేసీ వర్గం పట్టుదల.. ఈ రెండూ కలిపి పట్టణం మొత్తం రాజకీయ ఉత్కంఠ వాతావరణంలో ముంచేశాయి. రాబోయే గంటల్లో తాడిపత్రిలో ఏమి జరుగుతుందో అన్నది రాష్ట్రవ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి: