
సాధారణంగా రాజకీయ నాయకుల మధ్య వాగ్వాదం చోటు చేసుకోవడం మనం చూస్తూనే ఉంటాం. పైకి అందరూ అన్నదమ్ముల్లా కలిసే ఉన్నా.. లోలోపల మాత్రం రాజకీయాలు చేస్తూ ఉంటారు అనే వార్తలు ఎప్పటికప్పుడు బయటకి స్పష్టం అవుతూ ఉంటాయి. అయితే ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే.. అనుకున్న టైం కి రాలేదు అని, మైక్ ఆన్ లో లేదని, ఒక మంత్రిని ఇంకొక మంత్రి "దున్నపోతు" అంటూ సంచలన కామెంట్లు చేశారు .అయితే మైక్ ఆన్ లో ఉండడంతో ఆ విషయం కాస్త సదరు మంత్రికి చేరింది . ఇంకేముంది మంత్రుల మధ్య వార్ కాస్త ముదిరింది. ఇంతకీ ఆ మంత్రులు ఎవరు? ఎందుకు అవతల మంత్రి సమయానికి రాలేదు? ఇంతలోనే ఆయన అంత పెద్ద మాట అనాల్సిన అవసరం ఏముంది.. ? ఇలా కొన్ని విషయాలు వైరల్ అవుతున్నాయి.. మరి అసలు విషయం ఏమిటో ఇప్పుడు చూద్దాం.
అసలు విషయంలోకి వెళ్తే.. తెలంగాణ మంత్రులుగా.. కేబినెట్ విస్తరణలో పదవులు పొందిన పొన్నం ప్రభాకర్ గౌడ్, గడ్డం వివేక్ వెంకటస్వామి, అడ్లూరి లక్ష్మణ్ కుమార్. వివాదం ఏమిటి అనే విషయానికొస్తే.. మంత్రులు పొన్నం ప్రభాకర్ గౌడ్, వివేక్, అడ్లూరి లక్ష్మణ్ మీడియా సమావేశం నిర్వహించారు. అయితే అనుకున్న సమయంలోపే మంత్రులు పొన్నం, వివేక్ అక్కడికి చేరుకున్నారు. కానీ లక్ష్మణ్ సమయానికి రాలేదు. దాంతో మంత్రి పొన్నం అసహనానికి లోనై.. పక్కనే ఉన్న మంత్రి వివేక్ తో అడ్లూరి లక్ష్మణ్ ని ఉద్దేశించి.." మనకు టైం అంటే ఏంటో తెలుసు.. జీవితం అంటే ఏంటో తెలుసు.. కానీ వాడు ఒక దున్నపోతు.. వాడికేం తెలుసు" అంటూ గుసగుసలాడారు. అయితే అక్కడ మైకులు పనిచేయడంతో పొన్నం చేసిన అనుచిత వ్యాఖ్యలు కాస్త బయటకు వినిపించి వైరల్ అయ్యాయి.
పొన్నం వ్యాఖ్యలు లక్ష్మణ్ కి చేరడంతో ఆయన ఫైర్ అయ్యారు. పక్కనే ఉన్న వివేక్ పై కూడా అసహనం వ్యక్తం చేశారు. మరి వివేక్ పై ఫైర్ అవడానికి కారణం.. పొన్నం చేసిన వ్యాఖ్యలను వివేక్ ఖండించలేదు. పైగా పొన్నంకు సపోర్ట్ చేస్తున్నట్లుగా మాట్లాడాడట. అందుకే లక్ష్మణ్ పొన్నం
తో పాటు వివేక్ పై కూడా మండిపడ్డారు. ముఖ్యంగా తనపై చేసిన అనుచిత వ్యాఖ్యలకు లక్ష్మణ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ.." తాను పుట్టిన సామాజిక వర్గాన్ని, తమ జాతిని అవమానించేలా పొన్నం మాట్లాడారు. నేను మంత్రి కావడం, మా వర్గంలో పుట్టడం నా తప్పా? అసలు పొన్నం ప్రభాకర్ తప్పును ఒప్పుకొని క్షమాపణ చెప్పాలి. ఆయనలాగా అహంకారంగా మాట్లాడడం నాకు రాదు.. మా గౌరవం కోసం మౌనంగా మాత్రం ఉండను" అంటూ లక్ష్మణ్ స్పష్టం చేశారు.
అంతేకాదు "నేను కుర్చీలో కూర్చుంటే మంత్రి వివేక్ లేచి వెళ్లిపోయారు. సహచర మంత్రిని అవమానించిన వివేక్ చూస్తూ ఊరుకున్నారు. ఇలాంటి వ్యవహారం కాంగ్రెస్ పార్టీ విలువలకు విరుద్ధం" అంటూ ఈ ఘటనపై కాంగ్రెస్ అగ్రనేతలకు ఫిర్యాదు చేశారు అట్లూరి లక్ష్మణ్.
దున్నపోతు అంటూ చేసిన అనుచిత వ్యాఖ్యలపై ఇప్పటికే మల్లికార్జున ఖర్గే , మీనాక్షి లకు లేఖ రాశానని , రేపటికల్లా పొన్నం ప్రభాకర్ క్షమాపణలు చెప్పాలని, లేకపోతే జరిగే పరిణామాలకు ఆయనే బాధ్యత వహించాలి అంటూ కూడా హెచ్చరించారు. త్వరలో పార్టీ పెద్దలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ , మల్లికార్జున, మీనాక్షిలను వ్యక్తిగతంగా కలుస్తానని.. తనకు అండగా నిలిచిన మాదిగ కుల బాంధవులు , కుల సంఘాలకు కృతజ్ఞతలు తెలియజేశారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వ్యవహారం కాంగ్రెస్ పార్టీలో సంచలనంగా మారింది. మరి దీనిపై పార్టీ పెద్దలు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి.