
తెలంగాణలో పదేళ్ల తర్వాత అధికారంలోకి తిరిగి వచ్చిన కాంగ్రెస్ పార్టీ లోపలి విభేదాలతో తంటాలు పడుతోంది. అధికారం దక్కిన తర్వాత ఆ బలం, ఉత్సాహం కొనసాగాలి కానీ ప్రస్తుతం పరిస్థితి పూర్తిగా తారుమారైంది. చిన్నచిన్న గొడవలతో నేతలు ఒకరిపై ఒకరు బహిరంగంగా విమర్శలు చేసుకుంటూ పార్టీ పరువును వీధికెక్కిస్తున్నారు. ముఖ్యంగా మంత్రులే పరస్పరం గొడవపడటం, మీడియా ముందే వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం పార్టీ హైకమాండ్‌కు తలనొప్పిగా మారింది.
మారని నేతల తీరుతెన్నులు :
పార్టీ వ్యవహారాల ఇన్ ఛార్జిగా గాంధీ కుటుంబానికి అత్యంత సన్నిహితురాలైన మీనాక్షి నటరాజన్‌ను నియమించినప్పుడు, కాంగ్రెస్ నేతల్లో క్రమశిక్షణ వస్తుందని అనుకున్నారు. కానీ పరిస్థితి అంతకంతకూ చేదుగా మారుతోంది. మంత్రుల మధ్య సమన్వయం లేకపోవడం, నేతల్లో సఖ్యత కొరవడడం వల్ల పార్టీ క్యాడర్ అయోమయానికి గురవుతున్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక, స్థానిక సంస్థల ఎన్నికలు దగ్గరపడుతుండగా వరస గొడవలు పార్టీకి తలనొప్పిగా మారాయి.
మీనాక్షి నటరాజన్ సింప్లిసిటీ – నేతల్లో జంకు లేదు :
మీనాక్షి నటరాజన్ రాహుల్ గాంధీ కోటరీలో కీలక నేత. బయోకెమిస్ట్రీలో పీజీ చేసిన ఆమె విద్యార్థి దశలోనే కాంగ్రెస్ పార్టీలో చేరి ఎన్‌ఎస్‌యూఐ నుంచి ఎదిగారు. 2009లో ఎంపీగా విజయం సాధించి, 2024 లో మళ్లీ లోక్‌సభలోకి అడుగుపెట్టారు. రాహుల్ గాంధీకి నమ్మకమైన నేతల్లో ఆమె ఒకరు. అలాంటి నేతను తెలంగాణ ఇన్‌ఛార్జిగా నియమించిన తర్వాత పార్టీ గాడిలో పడుతుందనుకున్నారు కానీ ఆమె సాదాసీదా తీరుతో నేతల్లో భయం లేకుండా వ్యవహరిస్తున్నారు.
మంత్రులే బిగ్ ప్రాబ్లం! :
ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన మంత్రులే గొడవల్లో పడటం పార్టీని ఇబ్బందుల్లోకి నెడుతోంది. హైకమాండ్ అసహనం వ్యక్తం చేస్తున్నా, మీనాక్షి నటరాజన్ ఎటువంటి కఠిన చర్యలు తీసుకోకపోవడం వల్ల పరిస్థితి మరింత చెడిపోతోందన్న అభిప్రాయం పార్టీ శ్రేణుల్లో వినిపిస్తోంది. ఎమ్మెల్యేలు, మంత్రులు వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ పార్టీకి నష్టం కలిగిస్తున్నారు.
రేవంత్ రెడ్డి మాట vs నేతల ప్రవర్తన .. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి “పదేళ్ల పాటు కాంగ్రెస్ అధికారంలో ఉంటుంది” అంటూ ధీమా వ్యక్తం చేస్తున్నప్పటికీ , నేతల ప్రవర్తన మాత్రం దానికి పూర్తి విరుద్ధంగా ఉంది. ఫీల్డ్‌లో క్యాడర్ ఉత్సాహంగా ఉన్నా, టాప్ లీడర్ల మధ్య అంతర్గత కలహాలు పార్టీ ఇమేజ్‌ను దెబ్బతీస్తున్నాయి. హైకమాండ్ కఠిన నిర్ణయాలే మార్గం .. మీనాక్షి నటరాజన్ రాహుల్ గాంధీకి నేరుగా రిపోర్ట్ చేసే స్థాయిలో ఉన్నారు. ఈ నేపథ్యంలో హైకమాండ్ ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటుందో అన్నది కీలకం. నేతలపై కఠిన చర్యలు తీసుకోకపోతే, రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి దెబ్బ తగిలే అవకాశం ఉందన్నది రాజకీయ విశ్లేషకుల అంచనా.