జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కాంగ్రెస్‌కు ప్రతిష్టాత్మక పోరాటంగా మారింది. ఈ ఎన్నికను ఏ విధంగానైనా గెలిపించాలన్న సంకల్పంతో సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా ఫీల్డ్‌లోకి దిగారు. ఒక్క చిన్న అవకాశం కూడా వదలకుండా పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ విజయం కోసం తాను మొత్తం ప్లాన్‌ను పర్యవేక్షిస్తున్నారు. రేవంత్ ఇప్పటికే డివిజన్‌ల వారీగా నమ్మకస్తులైన నేతలను ఇంచార్జ్‌లుగా నియమించారు. ప్రతి ఒక్కరికీ టార్గెట్లు కేటాయించి, “ఓటు చెల్లించడమే కాదు, పోలింగ్ రోజున ఓటర్ని బూత్‌కి తీసుకురావాలి” అంటూ స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. పోలింగ్‌కు సంబంధించిన ప్రతి అంచునూ రేవంత్ మైక్రో లెవెల్‌లో మేనేజ్ చేయాలని నిర్ణయించుకున్నారు.


జూబ్లీహిల్స్‌లో తానే అభ్యర్థి అన్నట్టుగా రేవంత్ విస్తృత ప్రచారాన్ని ప్రారంభించారు. వర్గాలవారీగా ఓటర్ల సైకాలజీని అర్థం చేసుకుని, వారికి అనుగుణంగా హామీలు, ప్రలోభాలు, ఆకర్షణలు ఇచ్చే విధంగా వ్యూహాలు వేశారు.మైనారిటీల ఓటు బ్యాంకును తన వైపు తిప్పుకోవడానికి మజ్లిస్ మద్దతును ఉపయోగించుకునే ప్రయత్నం చేస్తున్నారు. మరోవైపు సినీ కార్మికులకు సాయం, ఉపాధి అవకాశాల మాటలు, కమ్మ సామాజిక వర్గ నేతలతో భేటీలు, యువతను ఆకట్టుకునే రోడ్‌షోలు – అన్నీ రేవంత్ ప్రణాళికలో భాగమే. “జూబ్లీహిల్స్ గెలిస్తే, హైదరాబాద్ మొత్తాన్ని గెలిచినట్టే” అన్న రేవంత్, ఈ ఉప ఎన్నికను రాజకీయ ప్రతిష్ట పోరుగా మలుస్తున్నారు.



పోల్ మేనేజ్‌మెంట్‌నే ఈ ఎన్నికలో కీలకంగా భావిస్తున్న రేవంత్, ప్రతి బూత్‌లో కాంగ్రెస్ సానుభూతిపరులైన ఓటర్లను గుర్తించమని సూచించారు. ఇతర జిల్లాల నుంచి ప్రత్యేక బృందాలను రప్పించి, ఒక్కో ఓటర్ని కనీసం మూడు సార్లు కలసి ఓటు అడగాలి అని ఆదేశించారు. ఇదంతా పర్యవేక్షించడానికి ప్రత్యేక టీమ్‌ను ఏర్పాటు చేసి, ప్రతి రోజు రిపోర్ట్ తీసుకుంటున్నారు. బీఆర్ఎస్ ప్రచారం, ప్రభుత్వ వైఫల్యాలపై వచ్చే ప్రతికూల ప్రభావాన్ని తగ్గించడానికి రేవంత్ పాజిటివ్ ప్రాచారంపై ఫోకస్ చేస్తున్నారు. ప్రజల్లో తాము సక్రమంగా పాలిస్తున్నామన్న నమ్మకాన్ని కల్పించడమే లక్ష్యంగా పెట్టుకున్నారు.



అయితే పార్టీ అంతర్గత విభేదాలు కూడా తలెత్తుతున్నాయి. కొన్ని వర్గాలు “రేవంత్ బలహీనత బయటపడాలి” అన్న ఉద్దేశంతో వ్యతిరేకంగా పని చేస్తున్నాయన్న వార్తలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో రేవంత్ “గెలిచినా, ఓడినా బాధ్యత నాదే” అంటూ తానే లీడ్ తీసుకున్నారు. “గెలిస్తే క్రెడిట్ అందరికీ, ఓడితే తప్పు రేవంత్‌దే” అని తెలుసుకున్న సీఎం, ఇప్పుడేమో ఈ ఎన్నికను తన ప్రతిష్ట యుద్ధంగా మార్చేశారు. జూబ్లీహిల్స్‌లో రేవంత్ దూకుడు చూస్తే, కాంగ్రెస్ గెలుపు పథకం కేవలం వ్యూహం కాదు – యుద్ధం లాంటి ఆపరేషన్ అని చెప్పొచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: