గత నెల 24న కర్నూలు జిల్లాలో వేమూరి కావేరి ప్రైవేట్ ట్రావెల్ బస్సు ప్రమాదంలో సుమారుగా 19 మంది సజీవ దహనమయ్యారు. అయితే ఈ ప్రమాదం బస్సు డ్రైవర్ నిర్లక్ష్యం వల్లే జరిగిందని చాలామంది ఆరోపణలు చేశారు. ఈ విషయం మరువక ముందే ఇప్పుడు తాజాగా తెలంగాణలోని రంగారెడ్డి జిల్లాలో ఈరోజు ఉదయం మరొక పెను విషాదం చోటు చేసుకుంది. హైదరాబాద్ - బీజాపూర్ జాతీయ రహదారి పైన వెళ్తున్న ఆర్టీసీ బస్సును టిప్పర్ లారీ అత్యంత వేగంగా ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో బస్సు డ్రైవర్ తో పాటుగా మరో 17 మంది మృతి చెందినట్లుగా వినిపిస్తోంది. వీటికి తోడు మరో 20 మందికి పైగా ప్రయాణికులకు గాయాలైనట్లుగా సమాచారం.


 ఈ బస్సు ప్రమాదంలో సుమారుగా 70 మంది ప్రయాణికులు సైతం ప్రయాణిస్తున్నారు. ఈ బస్సు తాండూరు నుంచి హైదరాబాద్ కి వస్తూ ఉండగా ఈ ప్రమాదం జరిగింది. ఈ బస్సులో ఎక్కువగా విద్యార్థులు, ఉద్యోగులే ఉన్నట్లుగా తెలుస్తోంది. వేగంగా వచ్చిన టిప్పర్ లారీ అదుపుతప్పి బస్సుని చాలా బలంగా ఢీ కొట్టడంతో బస్సు ముందు భాగం నుజ్జు నుజ్జు అయ్యిందని, టిప్పర్ లో ఉన్న కంకర మొత్తం బస్సు ముందు భాగంలో పడిపోవడంతో అందులో కూర్చున్న ప్రయాణికులు కంకరలోనే కూరుకుపోయారు.


లారీ డ్రైవర్ కూడా అక్కడికక్కడే మృతి చెందారు. అలాగే బస్సు డ్రైవర్ తో పాటు ముందు భాగంలో ఉన్న ప్రయాణికులు కూడా ప్రాణాలు కోల్పోయినట్లు తెలుస్తోంది. ఈ విషయం పోలీసులకు సమాచారం అందిన వెంటనే హుటా హుటిగా సంఘటన స్థలానికి చేరుకున్నారు. జెసిబి సహాయంతో సహాయక చర్యలు చేపట్టగా కంకరలో కూరుకుపోయిన మృతదేహాలను, గాయపడిన ప్రయాణికులను సైతం అతి కష్టం మీద బయటకు తీసినట్లు అధికారులు తెలుపుతున్నారు. గాయాలైన వారిని వెంటనే ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్టుగా తెలుస్తోంది. గాయపడిన వారిలో పదిమందికి పైగా ప్రయాణికుల పరిస్థితి విషయంగానే ఉన్నట్లు సమాచారం. ఈ ప్రమాదం టిప్పర్ లారీ అతివేగం, అజాగ్రత్త వల్లే జరిగిందని పోలీసులు అంచనా వేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: