బీహార్‌లో అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ రాష్ట్ర రాజకీయ వాతావరణం మరింత వేడెక్కుతోంది. ఈ నేపథ్యంలో జనశక్తి జనతా దళ్‌ (జేజేడీ) అధినేత తేజ్ ప్రతాప్ యాదవ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎన్నికలు పూర్తయ్యేలోపు తనను చంపేస్తారనే భయాన్ని ఆయన బహిరంగంగా వ్యక్తం చేశారు. రాష్ట్రంలో పెరుగుతున్న నేరాలు, రాజకీయ ఉద్రిక్తతల నేపథ్యంలో తన ప్రాణాలకు ముప్పు ఉందని ఆయన పేర్కొన్నారు. తేజ్ ప్రతాప్ మాట్లాడుతూ.. “ప్రస్తుతం నాకు లభిస్తున్న భద్రతా ఏర్పాట్లు సరిపోవు. నా వ్యక్తిగత భద్రతను మరింత పెంచాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ గారిని, కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాను. ఎందుకంటే రాజకీయ శత్రువులు నన్ను లక్ష్యంగా చేసుకునే అవకాశం ఉంది. భద్రతా చర్యలు బలపరిస్తేనే నేను నిర్భయంగా ప్రచారం చేయగలను,” అని అన్నారు.ఇందుకు ముందు ఆయన పలువురు ఎన్నికల అధికారులను కలిసి తన ఆందోళనలను వ్యక్తం చేశారు. తేజ్ ప్రతాప్ తెలిపినట్లుగా, తన స్వస్థలం సుపాల్ నియోజకవర్గం నుండి పోటీ చేస్తున్న తన పార్టీ అభ్యర్థిపై కూడా ఫిర్యాదు చేసానని అన్నారు. ఆ అభ్యర్థి మహాగఠ్‌బంధన్‌ అభ్యర్థికి మద్దతు కోరారన్న ఆరోపణలు ఆయన చేశారు.


తేజ్ ప్రతాప్ చేసిన ఈ వ్యాఖ్యలు బీహార్ రాజకీయాల్లో సంచలనం రేపాయి. ఎన్నికల వాతావరణంలో ఇప్పటికే ఉద్రిక్తతలు నెలకొన్న నేపథ్యంలో, ఆయన ప్రాణహాని భయాందోళనలు కొత్త చర్చకు దారితీశాయి. ఎన్నికల కమిషన్ భరోసా: "హింసాత్మక చర్యలు సహించము" ఇక మరోవైపు, బీహార్ అసెంబ్లీ ఎన్నికల ఏర్పాట్లు వేగంగా జరుగుతున్నాయని ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ) జ్ఞానేశ్ కుమార్ తెలిపారు. ఎన్నికల్లో ఎలాంటి హింసాత్మక చర్యలకూ చోటు ఇవ్వబోమని ఆయన స్పష్టం చేశారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.“ఓటర్లు ఎటువంటి భయభ్రాంతులు లేకుండా, పూర్తిగా స్వేచ్ఛగా ఓటు వేయవచ్చు. ఎన్నికలు పూర్తిగా శాంతియుతంగా, పారదర్శకంగా జరగడం మా ప్రధాన లక్ష్యం,” అని ఆయన పేర్కొన్నారు.



జ్ఞానేశ్ కుమార్ ఆదివారం మీడియాతో మాట్లాడుతూ, “ఎన్నికల సమయంలో ఎవరికీ ప్రత్యేక ప్రాధాన్యం ఉండదు. ఎన్నికల సంఘం ముందు అందరూ సమానమే. ఎలాంటి పక్షపాతం, వివక్ష ఉండదు. ప్రజాస్వామ్య పండుగలో ప్రతి ఓటరు ఉత్సాహంగా పాల్గొనాలని మేము కోరుతున్నాం,” అని పిలుపునిచ్చారు. బీహార్ ఎన్నికల వేళ రాజకీయాలు రోజురోజుకీ వేడెక్కుతున్నాయి. ఒకవైపు జేజేడీ చీఫ్ తేజ్ ప్రతాప్ యాదవ్ తన భద్రతపై ఆందోళన వ్యక్తం చేస్తుంటే, మరోవైపు ఎన్నికల సంఘం ప్రజలకు పూర్తి భద్రతా హామీ ఇస్తోంది. రాబోయే రోజుల్లో బీహార్ రాజకీయ వాతావరణం ఇంకా ఎంత రసవత్తరంగా మారుతుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: