విపక్షంలో ఉన్నప్పుడు సింపుల్‌గా వ్యవహరించడం రాజకీయ మర్యాద మాత్రమే కాదు, వ్యూహాత్మకంగా కూడా సమంజసం. ప్రజల మధ్య సానుభూతిని పొందాలంటే మందిబలంతో, కాన్వాయ్ దర్జాతో రాకుండా ఉండటం మంచిది. తుపాను బాధితులు కోల్పోయింది పంటలు, గృహాలు, జీవనాధారం - ఆ సమయంలో వేలమంది జన సమూహం, భారీ కాన్వాయ్ మధ్య జరిగే పరామర్శ కార్యక్రమం కంటే సానుభూతితో చేసే నేరుగా మాట్లాడటం ఎక్కువ ప్రభావం చూపుతుంది. అయితే వైసీపీ వర్గాల ఆలోచన వేరేలా ఉంది. “మా నేత వస్తున్నారు కాబట్టి భారీగా హాజరు కావాలి” అన్న మైండ్‌సెట్‌తోనే కదలడం కనిపిస్తోంది. అదే ఇప్పుడు పార్టీకే మైనస్‌గా మారే అవకాశం ఉందంటూ విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. అధికారంలో ఉన్నప్పుడు మర్చిపోయిన పాఠం ఇప్పుడు గుర్తొచ్చిందా? ఇక్కడే ఒక వ్యంగ్యమైన పోలిక వినిపిస్తోంది.
వైసీపీ అధికారంలో ఉన్న రోజుల్లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పర్యటనకు కూడా ఇలాగే పోలీసు పరిమితులు విధించారు. అప్పట్లో “భద్రతా కారణాలు” అంటూ చెప్పిన అదే మాటలు ఇప్పుడు వైసీపీకి ఎదురవుతున్నాయి. అంటే, అధికారంలో ఉన్నప్పుడు విపక్షాలపై పెట్టిన నియమాలు — ఇప్పుడు విపక్షంగా ఉన్న వైసీపీ మీదే వర్తిస్తున్నాయన్నమాట. రాజకీయ సమీకరణాలు మారినా నిబంధనలు మారవు. జగన్ పరామర్శ పర్యటన బలప్రదర్శనగా మారితే, బాధితులకు సాంత్వన కంటే రాజకీయ ప్రయోజనం సాధించాలనే భావన ప్రజల్లో కలగొచ్చు. అలా జరిగితే సానుభూతి కాకుండా వ్యతిరేకత దక్కే ప్రమాదం ఉంది. మొత్తానికి, పోలీసుల షరతులపై వైసీపీ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నా, ఆ ఆగ్రహం కంటే ఆలోచన అవసరం ఉంది. ప్రజల గుండెల్లో చోటు సంపాదించాలంటే కాన్వాయ్ కాదు – సానుభూతి కావాలి!
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి