జూబ్లిహిల్స్ ఉపఎన్నికలు దగ్గరపడుతున్న కొద్దీ, రాజకీయ వాతావరణం వేడెక్కుతోంది. ముఖ్యంగా బీజేపీ తరఫున ప్ర‌చారం చేస్తున్న బండి సంజయ్ వ్యాఖ్యలు, హామీలు మరోసారి హాట్ టాపిక్‌గా మారాయి. సాధారణంగా బీజేపీ నేతలు ప్రజలకు అభివృద్ధి, కేంద్ర నిధులు, విద్యా, ఆరోగ్య సదుపాయాలు వంటి అంశాలపై హామీలు ఇస్తుంటారు. అయితే బండి సంజయ్ మాత్రం కొంచెం భిన్నంగా మాట్లాడుతారు. ఆయన అజెండా ఎప్పుడూ భిన్నంగా, వివాదాస్పదంగా ఉంటున్నాయి. ఇటీవ‌ల ఆయన జూబ్లిహిల్స్ ప్రజల ముందుకు వచ్చి మరో సంచలన వాగ్దానం చేశారు. బీజేపీ అభ్యర్థిని గెలిపిస్తే, జూబ్లిహిల్స్ పేరు సీతారాంపురం‌గా మార్చేస్తామని ప్రకటించారు. ఇది వినగానే అక్కడి ప్రజలు, రాజకీయ వర్గాలు ఆశ్చర్యపోయారు. ఎందుకంటే, జూబ్లిహిల్స్ అనేది ముస్లిం మూలం ఉన్న పేరు కాదు. ఆ ప్రాంతానికి “జూబ్లీ” అనే పేరు బ్రిటిష్ కాలంలో క్వీన్ విక్టోరియా జూబ్లీ వేడుకల సందర్భంగా వచ్చింది. అంటే, చరిత్రాత్మక నేపథ్యం ఉంది గాని, మత సంబంధం లేదు.


అయినా కూడా బండి సంజయ్ ఆ పేరును మార్చాలని ఎందుకనుకున్నారు అనేది అందరికీ ప్రశ్న. ఆయన ఈ ప్రకటనతో మతపరమైన భావోద్వేగాలను రేకెత్తించి, హిందూ ఓటర్లను ఆకర్షించాలనే ఉద్దేశ్యం ఉందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. “హిందువుల ఐక్యత” గురించి తరచూ మాట్లాడే బండి సంజయ్, ఈసారి కూడా అదే లైన్‌లో ప్రచారం కొనసాగిస్తున్నారు. గతంలో ఆయన ముస్లిం టోపీ, మదర్‌సా విద్య, ఇతర మతాల చిహ్నాలపై చేసిన వ్యాఖ్యలు కూడా పెద్ద వివాదాలకే కారణమయ్యాయి. బీజేపీ ఇప్పటికే దేశవ్యాప్తంగా ముస్లిం పేర్లతో ఉన్న పట్టణాల పేర్లు మార్చే పాలసీని కొన్ని రాష్ట్రాల్లో అమలు చేస్తోంది. యూపీలో అలీగఢ్‌ ను హరిక్షేత్రం, అల్లాహాబాద్‌ను ప్రయాగ్‌రాజ్‌గా మార్చారు. అయితే, తెలంగాణలో అటువంటి పాలసీని అధికారికంగా ఎక్కడా ప్రకటించలేదు. అయినప్పటికీ, బండి సంజయ్ తరచూ కరీంనగర్, హైదరాబాద్ వంటి నగరాల పేర్ల మార్పుపై కూడా సూచనలు చేశారు.


జూబ్లిహిల్స్ పేరు మార్చడం ప్రజల మన్నన పొందే నిర్ణయం కానే కాదు. ఈ ప్రాంతం హైదరాబాద్లో అత్యంత ప్రెస్టీజియస్ జోన్‌గా గుర్తింపు పొందింది. రియల్ ఎస్టేట్, సినీ, రాజకీయ ప్రముఖులు ఎక్కువగా నివసించే ఈ ప్రాంతానికి ఆ పేరే బ్రాండ్‌గా మారింది. అలాంటి పేరును మార్చేయడం ప్రజలకు నచ్చే విషయం కాదని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. మొత్తం మీద, బండి సంజయ్ చేసిన “జూబ్లిహిల్స్‌ను సీతారాంపురం‌గా మార్చేస్తాం” అన్న వ్యాఖ్య ఇప్పుడు రాజకీయ వేదికపై కొత్త చర్చకు తెరలేపింది. ఇది బీజేపీకి ప్లస్ అవుతుందా లేక రివర్స్ అవుతుందా అన్నది మాత్రం వచ్చే రోజుల్లో స్పష్టమవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: