తెలంగాణలో ఉప ఎన్నికల రాజకీయం ఇప్పట్లో చల్లారేలా లేదు! జూబ్లీహిల్స్ యుద్ధం ముగిసిందో లేదో... ఇప్పుడు పక్కనే ఉన్న మరో కీలక నియోజకవర్గం ఖైరతాబాద్ వైపు అందరి దృష్టి మళ్లింది. ఇక్కడ ఉప ఎన్నిక త్వరలో జరగడం ఖాయమని రాజకీయ విశ్లేషకులు బలంగా చెబుతున్నారు. దీనికి ప్రధాన కారణం.. సీనియర్ నేత దానం నాగేందర్! పార్టీ మారిన దానంపై బీఆర్‌ఎస్ అస్త్రం! .. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ (BRS) తరఫున ఖైరతాబాద్ నుంచి గెలిచిన దానం నాగేందర్... ఆ తర్వాత కొద్ది రోజులకే కాంగ్రెస్ (Congress) గూటికి చేరారు. అంతేకాదు, 2024 పార్లమెంట్ ఎన్నికల్లో సికింద్రాబాద్ నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ కూడా చేశారు. దీంతో పార్టీ ఫిరాయింపులకు పాల్పడిన 10 మంది ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలని బీఆర్‌ఎస్... స్పీకర్‌కు ఫిర్యాదు చేసింది. స్పీకర్ నిర్ణయం ఆలస్యం కావడంతో, బీఆర్‌ఎస్ కోర్టును ఆశ్రయించింది.

సుప్రీం ఆదేశాలతో ఇటీవల స్పీకర్ ప్రసాద్ కుమార్ ఎమ్మెల్యేల అనర్హతపై విచారణ జరుపుతున్నారు. ఈ 10 మందిలో... కాంగ్రెస్ అభ్యర్థిగా పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేసిన దానం నాగేందర్‌పై బలమైన సాక్ష్యాలు ఉన్నాయని, ఆయన ఎన్నికల నిబంధనలను ఉల్లంఘించారని బీఆర్‌ఎస్ బలంగా వాదిస్తోంది. ఈ పరిస్థితిలో ఆయన అనర్హత వేటు తప్పించుకోవడం కష్టమని ప్రచారం జరుగుతోంది. అనర్హతకు ముందే రాజీనామా డ్రామా? .. దానం నాగేందర్‌పై అనర్హత వేటు పడటం ఖాయమని ప్రచారం జరుగుతుండటంతో... అంతకంటే ముందే ఆయన తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసే అవకాశం ఉందని గుసగుసలు వినిపిస్తున్నాయి! నిజానికి దానం ఎప్పుడో రాజీనామాకు సిద్ధపడ్డా, సరైన సమయం కోసం ఎదురుచూసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆ విషయాన్ని ఇన్నాళ్లూ వాయిదా వేశారు అని అంటున్నారు. జూబ్లీహిల్స్ ఎన్నికల తర్వాత రాష్ట్రంలో కాంగ్రెస్, బీఆర్‌ఎస్ బలాబలాలు ప్రజలకు కొంత అర్థమయ్యాయి కాబట్టి... ఇప్పుడు దానం రాజీనామా విషయంలో సీఎం నిర్ణయం తీసుకుంటారని చెబుతున్నారు.

బీఆర్‌ఎస్ వైఖరిలో మార్పు? .. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో చేయి కాల్చుకున్న బీఆర్‌ఎస్... ఇప్పుడు ఖైరతాబాద్ ఉప ఎన్నికను కూడా కోరుకునే పరిస్థితిలో ఉందా అన్నది పెద్ద చర్చ. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల స్థానాలకు ఉప ఎన్నికలు వస్తే గెలిచి కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెబుతామని ఇంతకాలం బీఆర్‌ఎస్ నేతలు చెప్పుకొచ్చారు. కానీ, జూబ్లీహిల్స్ ఫలితం చూశాక... మరిన్ని ఉప ఎన్నికలను కోరుకునే ధైర్యం బీఆర్‌ఎస్‌కు లేకపోవచ్చు! అందుకే, అనర్హత పిటిషన్లపై స్పీకర్ త్వరగా నిర్ణయం వెలువడేలా ఒత్తిడి చేసే అవకాశం లేదని విశ్లేషకులు అంటున్నారు. అయితే, బీఆర్‌ఎస్‌ను మరింత ఒత్తిడిలోకి నెట్టే వ్యూహంతో సీఎం రేవంత్ రెడ్డి... దానం నాగేందర్‌తో రాజీనామా చేయిస్తే, ఖైరతాబాద్‌లో ఉప ఎన్నిక ఖాయమైనట్లే! ఈ నేపథ్యంలో... త్వరలోనే తెలంగాణ రాజకీయం మరో హాట్ వార్కు సిద్ధమవుతోందని చెప్పాలి!

మరింత సమాచారం తెలుసుకోండి: