ఆంధ్రప్రదేశ్‌లో గతేడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికలు రాష్ట్ర రాజకీయ ముఖచిత్రాన్నే మార్చేశాయి. ఐదేళ్లుగా అధికారంలో ఉన్న వైఎస్ జగన్‌ను పక్కనపెట్టి… చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, బీజేపీతో కూడిన ఎన్డీయే కూటమికి ప్రజలు ఘన విజయం కట్టబెట్టారు. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన ఈ కూటమి ప్రభుత్వం ఏడాదిన్నర పాలన పూర్తి చేసుకుంది. ఈ కాలంలో రాజకీయ లెక్కలు, అంచనాలు చాలానే మారిపోయాయి. ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్, విపక్ష నేతగా వైఎస్ జగన్ – ముగ్గురూ తమ తమ పాత్రల్లో ప్రజల అంచనాలకు తగ్గట్లుగా రాణించేందుకు ప్రయత్నిస్తున్నారు. కానీ అసలు ప్రశ్న ఒక్కటే … ప్రజల తీర్పు ఎవరి వైపు ఉందీ? దీనికి ఓ ఆసక్తికర సమాధానం ఇప్పుడు డిజిటల్ ప్రపంచం నుంచి బయటకు వచ్చింది. ఎన్డీయే సర్కార్ ఏడాదిన్నర పాలన సందర్భంగా పలు సర్వేలు, రాజకీయ విశ్లేషణలు వెలువడుతున్నాయి. కానీ ఈసారి ప్రత్యేకంగా గూగుల్ సెర్చ్ ట్రెండ్స్ ఆసక్తికర విషయాలను బయటపెట్టాయి.


ఈ ఏడాది ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించిన రాజకీయ నేతల్లో ప్రజలు ఎక్కువగా సెర్చ్ చేసిన పేర్లను పరిశీలిస్తే… ఎవరి క్రేజ్ ఎంత ఉందో స్పష్టంగా అర్థమవుతోంది. గూగుల్ డేటా ప్రకారం… పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు, వైఎస్ జగన్, నారా లోకేష్ – ఈ నలుగురు నేతలే టాప్ సెర్చ్‌లలో నిలిచారు. కానీ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే… సీఎం చంద్రబాబు, విపక్ష నేత జగన్‌లను మించి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఈ ఏడాది గూగుల్ సెర్చ్‌లలో టాప్‌లో నిలిచారు. గూగుల్ ట్రెండ్స్ ప్రకారం ఈ ఏడాది ప్రజల ఆసక్తి ఎక్కువగా పవన్ కళ్యాణ్‌పైనే కనిపించింది. ఆయన నిర్వహిస్తున్న శాఖలు, సనాతన ధర్మం, వారాహి డిక్లరేషన్, రాజకీయాలతో పాటు ఓజీ సినిమా వంటి అంశాలపై యూజర్లు ఎక్కువగా సెర్చ్ చేశారు. రాజకీయ నేతగా మాత్రమే కాకుండా… ఒక ఐకాన్‌గా పవన్ క్రేజ్ ఇంకా తగ్గలేదన్నది ఈ గణాంకాలు చెబుతున్నాయి. రెండో స్థానంలో ఉన్న చంద్రబాబు నాయుడును ప్రజలు ప్రధానంగా రాష్ట్ర పాలన, కొత్త పెట్టుబడులు, పరిశ్రమల రాక, వికసిత్ ఆంధ్రప్రదేశ్ విజన్ అంశాల్లో సెర్చ్ చేశారు.

 

అంటే పాలన, అభివృద్ధి పరంగా చంద్రబాబుపై ఆసక్తి ఎక్కువగా ఉందన్న మాట. మూడో స్థానంలో ఉన్న వైఎస్ జగన్‌ను ప్రజలు విపక్ష నేత పాత్ర, ప్రభుత్వంపై విమర్శలు, కేసులు, రాజకీయ భవిష్యత్తు వంటి అంశాల్లో ఎక్కువగా సెర్చ్ చేశారు. అధికారంలో లేని పరిస్థితుల్లోనూ జగన్ పేరు సెర్చ్‌లలో ఉండడం… ఆయనకు ఉన్న బలమైన కోర్ ఓటు బ్యాంక్‌ను సూచిస్తోంది. నాలుగో స్థానంలో ఉన్న నారా లోకేష్ను యువత ఎక్కువగా సెర్చ్ చేసినట్లు గూగుల్ చెబుతోంది. ప్రపంచ టెక్ దిగ్గజాలను ఏపీకి తీసుకురావడం, యువత కోసం ఆయన రూపొందిస్తున్న స్కిల్ రోడ్ మ్యాప్, ఐటీ పెట్టుబడులపై లోకేష్ చేసిన ప్రయత్నాలు సెర్చ్‌లకు కారణమయ్యాయి. మొత్తంగా చూస్తే… ఈ ఏడాది డిజిటల్ ప్రపంచంలో టాప్ పొలిటిషియన్ పవన్ కళ్యాణ్గా నిలిచారు. పాలనలో చంద్రబాబు, విపక్షంలో జగన్ తమ పాత్రలు పోషిస్తుండగా… ప్రజల ఆసక్తి, క్యూరియాసిటీ మాత్రం పవన్ వైపే ఎక్కువగా ఉన్నట్లు గూగుల్ ట్రెండ్స్ స్పష్టం చేస్తున్నాయి. ఎన్నికల ఫలితాల తర్వాత… ఇప్పుడు ఇది మరో రకమైన డిజిటల్ ప్రజాభిప్రాయంగా రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: