ఏపీలో వైసీపీ అధికారంలోకి వ‌చ్చి నాలుగు నెల‌లు కూడా కాకుండానే పార్టీ నేత‌ల మ‌ధ్య గ్రూపు త‌గాదాలు ఓ రేంజ్‌లో ఉంటున్నాయి. గుంటూరు, కృష్ణా, నెల్లూరు, రాయ‌ల‌సీమ ఇలా ఎక్క‌డ చూసినా ఇవే గ్రూపుల గోల ఎక్కువైంది. ఇక తాజాగా నెల్లూరు జిల్లాలో ఇద్ద‌రు వైసీపీ నేత‌ల మ‌ధ్య జ‌రిగిన వివాదం రాష్ట్ర వ్యాప్తంగ ర‌చ్చ ర‌చ్చ అవ్వ‌డంతో పాటు అటు పార్టీ ప‌రువును, ఇటు ప్ర‌భుత్వం ప‌రువును బ‌జారున ప‌డేసింది.


ఆ ఇద్ద‌రు నేత‌లు ఎవ‌రో కాదు జిల్లా వైసీపీ అధ్య‌క్షుడు, స‌ర్వేప‌ల్లి ఎమ్మెల్యే కాకాణి గోవ‌ర్థ‌న్‌రెడ్డి, నెల్లూరు రూర‌ల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధ‌ర్‌రెడ్డి. వీరిద్ద‌రి మ‌ధ్య గ‌త కొన్ని సంవ‌త్స‌రాలుగా నివురు గ‌ప్పిన నిప్పులా ఉన్న అసంతృప్తి తాజాగా ఒక్క‌సారిగా భ‌గ్గుమంది. వీరి వార్‌కు స‌రైన కార‌ణం ఏంట‌న్న‌ది తెలియ‌క‌పోయినా తాజాగా ఎంపీడీవో స‌ర‌ళ కోటంరెడ్డిపై ఫిర్యాదు చేయ‌డంతో గొడ‌వ ముదిరి పాకాన ప‌డింద‌న్న‌ది తేట‌తెల్ల‌మైంది.


వీరిద్ద‌రు నెల్లూరు జిల్లా వైసీపీలో సీనియ‌ర్లుగా ఉన్నారు. ఇద్ద‌రు రెండేసి సార్లు గెలిచారు. కాకాణి జిల్లా వైసీపీ అధ్య‌క్షుడిగా కూడా ఉన్నారు. వీరిద్ద‌రికి మంత్రి ప‌ద‌విపై ఆశ ఉంది. రెండున్న‌రేళ్ల త‌ర్వాత జ‌గ‌న్ మార్పులు, చేర్పులు చేసినా ఒక‌రికే ఛాన్స్ ఇస్తారు. ఇక ఇది కూడా ఇద్దరి మ‌ధ్య ఆధిప‌త్య పోరుకు మ‌రో కార‌ణం. చివ‌ర‌కు ఈ పంచాయితీ ప‌రిష్క‌రించే బాధ్య‌త జ‌గ‌న్ వైవీ సుబ్బారెడ్డి, సజ్జలకు జగన్ అప్పగించారు. నెల్లూరు జిల్లా నేతలతో వైవీ సుబ్బారెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి సమావేశమయ్యారు. మంత్రి అనిల్‌, ఎంపీలు ఆదాల ప్రభాకర్ రెడ్డి, వేమిరెడ్డి, ఎమ్మెల్యేలు భేటీలో పాల్గొన్నారు.


జ‌గ‌న్ సూచ‌న‌ల మేర‌కు వైవి, సజ్జ‌ల వీరి మ‌ధ్య గొడ‌వ రాజీ చేశార‌ట‌. ఫ్యూచ‌ర్‌లో కూడా గొడ‌వ లేకుండా ముందుకు సాగాల‌ని చెప్ప‌డంతో పాటు జ‌గ‌న్ వార్నింగ్ ఇచ్చార‌న్న విష‌యం కూడా వీరికి చెప్పిన‌ట్టు స‌మాచారం. ఇక భేటీ త‌ర్వాత బ‌య‌ట‌కు వ‌చ్చిన కాకాణి మాట్లాడుతూ తమ మధ్య మూడో వ్యక్తి వచ్చి మధ్యవర్తిత్వం చేయాల్సిన అవసరం లేదని.... శ్రీధర్ రెడ్డి తనకు బావమరిది అని... ఆయనతో వ్యక్తిగతంగా కుటుంబ సంబంధాలు ఉన్నాయని చెప్పడం విశేషం.



మరింత సమాచారం తెలుసుకోండి: