టీడీపీ అధికారం కోల్పోయాక చాలా క్లిష్ట పరిస్థుతులను ఎదుర్కొంటోంది. అధికారం కోల్పోవడం, నమ్మినబంటుల్లాంటి వాళ్లు బీజేపీలో చేరడం, కాకినాడలో కాపు నేతల సమావేశం, ప్రజావేదిక కూల్చివేత.. తో చంద్రబాబు తీవ్ర కన్ఫ్యూషన్ లో ఉన్నారు. ఈ కూల్చివేతలు తన నివాసం దాకా వచ్చేలా ఉన్నాయన్న ఆందోళనలో ఉన్న బాబుకు వేగంగా మరుతున్న పరిణామాలు కూడా కలవరపెడుతున్నాయి. ఇవి అక్రమ కట్టడాలనడానికి తమ వద్ద ఆధారాలున్నాయంటూ వైసీపీ నాయకులు టీడీపీ నాయకుల విమర్శలను తిప్పి కొడుతున్నారు. దీంతో చంద్రబాబు పార్టీ నేతలతో సమావేశాలు నిర్వహిస్తున్నారు.

 

బాబు ఇలా గందరగోళంలో వుంటే.. ప్రజావేదిక కూల్చివేత టీడీపీలో చిచ్చు రేపుతోంది. ఈ అంశంలో చంద్రబాబుకు అండగా నిలవాల్సిన సొంత వారే పార్టీకి వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేయడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. ప్రజావేదికపై బుద్దా వెంకన్న వ్యాఖ్యలను తూర్పుగోదావరి జిల్లా రామచంద్రాపురం టీడీపీ నేత తోట త్రిమూర్తులు తప్పు పట్టారు. “చంద్రబాబు మెప్పు కోసమే బుద్దా వెంకన్న ప్రజావేదికపై వ్యాఖ్యలు చేస్తున్నారని, ప్రజావేదికపై ఆందోళన చేస్తే ప్రజలకు తప్పుడు సంకేతాలు వెళ్తాయని, అధినేత భజనకు టీడీపీ నేతలు స్వస్తి పలుకాల”ని అన్నారు. దీంతో ఇప్పుడు టీడీపీలో ఉన్న పరిస్థితులకు తోడు ఈ వ్యాఖ్యలు అగ్నికి ఆజ్యం పోసినట్టయ్యాయి. ఇప్పటికే కాకినాడలో కాపు నేతల సమావేశంపై చర్చిస్తున్న చంద్రబాబుకు తోట వ్యాఖ్యలు మింగుడుపడడం లేదు. కాపు టీడీపీ నేతలు పార్టీ మారుతారన్న ఊహాగానాలకు త్రిమూర్తులు వ్యాఖ్యలు ఊతమిస్తున్నాయి. ఇప్పటికే సోషల్ మీడియాలో తోట పార్టీ మారుతున్నారని వార్తలొస్తున్నాయి. అసలే కాపు నేత కావడంతో ఈ వ్యాఖ్యలకు ప్రాధాన్యం సంతరించుకుంది. మరి దీనిపై చంద్రబాబు ఏవిధంగా స్పందిస్తారో చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: